NTV Telugu Site icon

UK Heatwave: బ్రిటన్ లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అల్లాడుతున్న ప్రజలు.. రైళ్లు బంద్

Uk Haeatwave

Uk Haeatwave

యూరప్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనేక దేశాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ లో కనీవిని ఎరగని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం దేశంలో రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పాటు ఎమర్జెన్సీని విధించింది. లండన్ లోని హీత్రూలో దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అంతకుముందు ఆగ్నేయ ఇంగ్లాండ్ సర్రే ప్రాంతంలో నమోదైన 39 డిగ్రీల ఉష్ణోగ్రతను బద్దలు కొట్టింది. సోమవారం లండన్ వ్యాప్తంగా వడగాలల తీవ్రత ఎక్కువగా కనిపించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బ్రిటన్ లో వేడి బాధ నుంచి తప్పించుకోవడానికి నదులు, సరస్సులకు వెళ్లి ఇప్పటివ వరకు ఐదుగురు మరణించారు.

మంగళవారం ఇంగ్లాండ్ లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రయాణాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారులను మూసేస్తున్నారు. రెడ్ జోన్ గుండా ప్రయాణించే రైళ్లను బంద్ చేసింది అక్కడి ప్రభుత్వం. యూకే రైల్ నెట్ వర్క్ ఈ తీవ్రమైన వేడిని తట్టుకోలేకపోతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. సోమవారం తూర్పు ఇంగ్లాండ్ లోని సఫోల్క్ లో గరిష్టంగా 38.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయింది. స్కాట్లాండ్, వేల్స్ లో కూడా సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Srilanka Crisis: శ్రీలంక సంక్షోభంపై జై శంకర్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్

ముఖ్యంగా బ్రిటన్ వ్యాప్తంగా రైల్ నెట్ వర్క్ పై ప్రభావం ఏర్పడింది. 40 డిగ్రీల వేడిలో ట్రాక్ ఉష్ణోగ్రత 50,60 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉండటంతో.. రైళ్లు పట్టాలు తప్పే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. మామూలుగా బ్రిటన్ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే అక్కడి వాతావరణ పరిస్థితికి అనుకూలంగా రైల్వే ట్రాక్, రోడ్లు, రన్ వేల నిర్మాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లూటన్ ఎయిర్ పోర్ట్, రాయల్ ఎయిర్ ఫోర్స్, బ్రైజ్ నార్టన్ లోని రన్‌వేలు వేడికి ప్రభావితం కావడంతో విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. బ్రిటన్ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి.