UK, France back UNSC permanent seat for India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతసభ్య దేశం కోసం భారత్ చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. వంద కోట్ల కన్నా అధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత సభ్య దేశం హోదా ఇవ్వకుంటే భద్రతా మండలికి అర్థమే ఉండదని పలుమార్లు భారత్ వ్యాఖ్యానించింది. భద్రతా మండలిని సంస్కరించాలని చాలా ఏళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో చైనా, అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా దేశాలు శాశ్వత సభ్యదేశ హోదా కలిగి ఉన్నాయి. వీటితో పాటు మరో 10 దేశాలు రెండేళ్ల కాలపరిమితికి తాత్కాలిక సభ్యదేశాల హోదాను పొందుతాయి. అయితే భారత్ తనకు శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని కోరుతోంది. ఈ విషయంపై భారత్ కు యూకే, ఫ్రాన్స్ దేశాలు మద్దతు ప్రకటించాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా కోసం భారత్ తో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్ పోటీ పడుతున్నాయి. అయితే వీటిలో భారత్, బ్రెజిల్ ముందు వరసలో ఉన్నాయి.
Read Also: Satyendar Jain: ఆప్ మంత్రి భోగాలు ఆహా.. జైలులోనే మసాజ్‌లు.. వీడియో వైరల్
ఇప్పటికే యూఎన్ లో యూకే రాయబారి బార్బరా వుడ్ వార్డ్ భారత శాశ్వత సభ్యదేశ హోదాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని కూడా ప్రస్తావించారు. మరోవైపు ఫ్రాన్స్ కూడా భారత్ కు మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో ఫ్రాన్స్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నథాలీ బ్రాడ్‌హర్స్ట్ శుక్రవారం భారత్ కు మద్దతు ప్రకటించారు. జీ-4 దేశాలైన జర్మనీ, ఇండియా, జపాన్, బ్రెజిల్ తరుపున భారత రాయబారి రుచితాకాంబోజ్ భద్రతమండలి సంస్కరణపై యూఎన్ లో గళాన్ని విప్పారు.
ఇదిలా ఉంటే వీటో అధికారం ఉన్న ఐదు సభ్యదేశాల్లో ఇప్పటికే భారత్ కు ఫ్రాన్స్, యూకేలు మద్దతు ప్రకటించగా.. రష్యా, అమెరికాలు ఎప్పటి నుంచో భారత్ కు శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు చైనా మాత్రం తన వీటో అధికారాన్ని ఉపయోగిస్తూ భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తోంది.
