Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
- అక్టోబర్ 7 దాడులపై సంచలన కథనం
- ముందే హెచ్చరించిన UAE అధ్యక్షుడు
- నెతన్యాహుపై తీవ్ర ఆరోపణలతో కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 అక్టోబర్ 7. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక భయానకమైన రోజు. ప్రపంచమంతా ఒక్కసారిగా గగుర్పాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశంపై పడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు దాదాపు 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అనంతరం ఇజ్రాయెల్ కూడా అంతే వేగంగా ప్రతీకార చర్యకు దిగింది. కొన్ని నెలల పాటు హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేసింది. హమాస్ కీలక నేతలందరినీ అంతమొందించింది.
తాజాగా హమాస్ మారణహోమంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. హమాస్ కుట్రపై ముందుగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌కు చెందిన ‘హారెట్జ్’ పత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. గాజాలో హమాస్‌కు కీలక నేతగా ఉన్న యాహ్వా సిన్వార్ భారీ స్థాయిలో ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధపడుతున్నట్లుగా.. అంటే ఒక ‘జిల్జల్’ (Zilzal), ‘భూకంపం’ లాంటి భారీ పరిణామానికి దారితీసే చర్యకు దిగబోతున్నట్లుగా బిన్ జాయెద్ హెచ్చరించినట్లు కథనంలో పేర్కొంది.
Also Read
యూఏఈ, ఇజ్రాయెల్ భద్రతా సంస్థ షిన్ బెట్‌కు చెందిన వర్గాలను ఉటంకిస్తూ ‘హారెట్జ్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. యూఏఈ అధ్యక్షుడు హెచ్చరించినా.. నెతన్యాహు సకాలంలో స్పందించలేదని.. నిఘా సంస్థలను కూడా హెచ్చరించలేదని.. అధ్యక్షుడితో జరిగిన 45 నిమిషాల ఫోన్ సంభాషణ గురించి అత్యున్నత స్థాయి భద్రతా అధికారులకు కూడా నెతన్యాహు వెల్లడించలేదని కథనంలో ఆరోపించింది.
45 నిమిషాల ఫోన్ కాల్లో ఏం జరిగింది?
అక్టోబర్ 7 మారణకాండకు సుమారు వారం, పది రోజుల ముందు బిన్ జాయెద్.. నెతన్యాహుతో 45 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడినట్లు కథనం పేర్కొంది. ఆ సమయంలో గాజాలో ‘ఏదో పెద్ద కుట్ర జరగబోతోంది’ అంటూ ఆయన హెచ్చరించినట్లు తెలిపింది. హమాస్ చేపట్టబోయే చర్య భారీ రక్తపాతానికి దారితీయడమే కాకుండా.. మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతంలో అస్థిరతకు కారణమవుతుందని, ఇజ్రాయెల్-అరబ్ దేశాల మధ్య కుదిరిన ‘అబ్రహం ఒప్పందాలు’ (Abraham Accords) కూడా దెబ్బతినే అవకాశం ఉందని యూఏఈ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సంభాషణ సమయంలో బిన్ జాయెద్‌కు చెందిన ఓ పాలస్తీనా సలహాదారు కూడా ఉన్నారని ‘హారెట్జ్’ పత్రిక పేర్కొంది. అయితే అధ్యక్షుడి హెచ్చరికకు నెతన్యాహు ఊహించిన దానికంటే చాలా ప్రశాంతంగా స్పందించినట్లు ఆ సలహాదారు చెప్పినట్లు కథనంలో తెలిపింది.
హమాస్ ప్రధానంగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నెతన్యాహు భావిస్తున్నట్లు చెప్పారని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని యూఏఈ అధ్యక్షుడికి నెతన్యాహు భరోసా ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత బిన్ జాయెద్.. అప్పటి సీఐఏ (CIA) డైరెక్టర్ విలియం జె. బర్న్స్‌తో కూడా ఈ సంభాషణ గురించి చెప్పినట్లు ఆ సలహాదారు వెల్లడించారు.
నెతన్యాహు ఉన్నత భద్రతా అధికారులకు చెప్పలేదా?
‘హారెట్జ్’ కథనం ప్రకారం.. బిన్ జాయెద్ చేసిన హెచ్చరికను నెతన్యాహు షిన్ బెట్, మొసాద్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) చీఫ్ ఆఫ్ స్టాఫ్ వంటి కీలక భద్రతా వ్యవస్థల అధిపతులకు చెప్పలేదని కథనంలో తెలిపింది. ఇదే సమయంలో హమాస్ నుంచి వచ్చిన మరో హెచ్చరిక కూడా ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు చేరినట్లు కథనం పేర్కొంది.
అసలు ‘జిల్జల్’ హెచ్చరిక ఎలా వచ్చింది?
2023 ప్రారంభంలో షిన్ బెట్, హమాస్ మధ్య రహస్య ప్రత్యక్ష చర్చల మార్గం ఏర్పడిందని పరిశోధనలో వెల్లడైనట్లు ‘హారెట్జ్’ తెలిపింది. ఖైదీల మార్పిడి విషయంలో ఇరుపక్షాలు దాదాపు చారిత్రాత్మక ఒప్పందానికి చేరుకున్నప్పటికీ.. ఖైదీల విడుదలకు మంత్రివర్గ కమిటీ అనుమతి అవసరం కావడంతో అది ఆలస్యమైందని పేర్కొంది.
నెతన్యాహు ఆ కమిటీ సమావేశాన్ని పలుమార్లు వాయిదా వేసినట్లు కథనం ఆరోపించింది. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఉన్న భయం లేదా తన ప్రభుత్వంలోని తీవ్రవాద భావజాలం కలిగిన భాగస్వాముల నుంచి వచ్చే వ్యతిరేకతపై ఆందోళన కారణం కావచ్చని పేర్కొంది. హమాస్‌తో చర్చల మార్గాన్ని నిర్వహిస్తున్న షిన్ బెట్ ప్రతినిధులు.. ఈ విషయం మీడియాకు లీక్ అవుతుందేమోనని నెతన్యాహు భయపడేవారని చెప్పినట్లు కథనం తెలిపింది. దీంతో చర్చలు వారం తర్వాత వారం నిలిచిపోయాయని ఓ అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది.
సిన్వార్ హెచ్చరిక.. ‘భయానక ఆపరేషన్’
చర్చలు ఆలస్యం కావడంతో యాహ్యా సిన్వార్ అసహనానికి గురైనట్లు కథనం పేర్కొంది. 2023 సెప్టెంబర్‌లో మధ్యవర్తి ద్వారా తాను ‘జిల్జల్’ లేదా ‘భూకంపం’ తరహా చర్యకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించాడని తెలిపింది. ఆ తర్వాత తాను చేపట్టబోయే చర్యను ‘అన్ని ఆశ్చర్యాలకు తల్లి’ (mother of all surprises), ‘భయానక ఆపరేషన్’గా సిన్వార్ అభివర్ణించినట్లు కథనం పేర్కొంది. అదే సమయంలో షిన్ బెట్-హమాస్ మధ్య ఏర్పడిన ప్రత్యక్ష చర్చల మార్గం కూడా తెగిపోయింది. అయితే అక్టోబర్ 7 దాడి జరిగిన ఏడాది తర్వాత, 2024 సెప్టెంబర్‌లో నిలిచిపోయిన బందీల ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ చర్చల మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిందని కథనం తెలిపింది.
సెప్టెంబర్ 15న షిన్ బెట్‌కు సమాచారం
సిన్వార్ హెచ్చరిక సెప్టెంబర్ 15న షిన్ బెట్‌కు చేరిందని ‘హారెట్జ్’ కథనంలో వెల్లడించింది. ఆ తర్వాత అప్పటి షిన్ బెట్ చీఫ్ రోనెన్ బార్ ఈ విషయాన్ని నెతన్యాహుకు వివరించినట్లు తెలిపింది. రెండు రోజుల తర్వాత జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమావేశంలో ఇజ్రాయెల్ ‘ఢీకొనే దిశగా వెళ్తోంది’ అని బార్ హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. యూదుల పండుగలకు ముందు గాజా, వెస్ట్ బ్యాంక్‌లో బలమైన దాడి లేదా మరింత కఠినమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించినట్లు తెలిపింది. అయితే సమావేశం ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని తగినంతగా పరిగణనలోకి తీసుకోలేదని UAE నాయకత్వం భావించిన తర్వాతే.. బిన్ జాయెద్ నెతన్యాహుకు నేరుగా ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కథనం తెలిపింది.
ఈజిప్ట్ నుంచి కూడా హెచ్చరిక?
యూఏఈతో పాటు ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కామెల్కు కూడా హమాస్ భారీ చర్యకు సిద్ధమవుతున్న సమాచారం అందినట్లు కథనం తెలిపింది. ఆయన కూడా నెతన్యాహును సంప్రదించి.. ‘అసాధారణమైన, భయానక ఆపరేషన్’కు హమాస్ సిద్ధమవుతోందని హెచ్చరించినట్లు తెలిపింది. అయితే గాజాలో పరిస్థితి తమ నియంత్రణలోనే ఉందని, ప్రస్తుతం తమ దృష్టి, సైనిక బలగాల మోహరింపు వెస్ట్ బ్యాంక్‌పై ఉందని నెతన్యాహు చెప్పినట్లు కథనం పేర్కొంది. అక్టోబర్ 1న జరిగిన భద్రతా సమావేశంలో UAE అధ్యక్షుడు, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి వచ్చిన హెచ్చరికల గురించి నెతన్యాహు ప్రస్తావించలేదని ‘హారెట్జ్’ కథనం తెలిపింది. ఇలాంటి ఉన్నత స్థాయి హెచ్చరికల గురించి భద్రతా అధికారులకు ముందే తెలిసి ఉంటే.. సిన్వార్ గతంలో చేసిన ప్రకటనలను, చర్చల నుంచి ఆయన వైదొలగడాన్ని వేరే కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉండేదని ఓ సీనియర్ షిన్ బెట్ అధికారి అభిప్రాయపడినట్లు కథనం పేర్కొంది.
అక్టోబర్ 7న మొదలైన ‘జిల్జల్’
2023 అక్టోబర్ 7న ఉదయం 6:29 గంటలకు హమాస్ దాడి ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌లో జరిగిన హింస, విధ్వంసానికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సరిహద్దు దాడుల్లో హమాస్ సుమారు 251 మందిని బందీలుగా తీసుకెళ్లినట్లు నివేదిక పేర్కొంది. వీరిలో పౌరులు, సైనికులు, విదేశీయులు ఉన్నారు.
నెతన్యాహు ఖండన
అయితే ‘హారెట్జ్’ పత్రిక ప్రచురించిన ఈ పరిశోధనాత్మక కథనాన్ని నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ కథనం ‘పూర్తిగా అబద్ధం’ అని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. సంబంధిత సమయంలో UAE అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్‌తో నెతన్యాహు మాట్లాడలేదని, ఆయన నుంచి ఎలాంటి హెచ్చరిక కూడా అందలేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు బిన్ జాయెద్ స్పందించలేదని ‘హారెట్జ్’ తెలిపింది.
నెతన్యాహుపై విమర్శలు
అయితే పత్రిక కథనం ఇజ్రాయెల్‌లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని, B’Yachad పార్టీ అధినేత నఫ్తాలి బెన్నెట్.. నెతన్యాహుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిన్వార్ భారీ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు UAE అధ్యక్షుడు నెతన్యాహును హెచ్చరించారని, అలాగే ఈజిప్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కామెల్ కూడా మారణకాండకు కొన్ని రోజుల ముందు ఇదే తరహా హెచ్చరిక ఇచ్చారని బెన్నెట్ పేర్కొన్నారు. అయినా నెతన్యాహు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. హమాస్‌ను ఒక ‘ఆస్తి’గా భావించే తన విధానంలో నెతన్యాహు బలంగా చిక్కుకుపోయారని, స్పష్టమైన హెచ్చరికలు అందినప్పటికీ చర్యలు తీసుకోలేదని బెన్నెట్ విమర్శించారు. అక్టోబర్ 7 విపత్తుకు నెతన్యాహు రాజకీయంగా మాత్రమే కాకుండా ప్రత్యక్షంగానూ బాధ్యత వహించాల్సి ఉంటుందని బెన్నెట్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ నెతన్యాహు కార్యాలయం ఖండించడం గమనార్హం.
తాజావార్తలు
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
-
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
-
Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!