NTV Telugu Site icon

PM Modi: యూఏఈలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం

Uae President Receives Pm Modi At Airport

Uae President Receives Pm Modi At Airport

జర్మనీ పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి తరలివెళ్లారు. అబుదాబిలో కాలుమోపిన ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ విమానాశ్రయానికి విచ్చేసి ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. మోదీని ఆలింగనం చేసుకుని తమ సుహృద్భావాన్ని ప్రదర్శించారు.

యూఏఈ అధ్యక్షుడి ఘనస్వాగతం పట్ల ప్రధాని మోదీ పొంగిపోయారు. “నా సోదరుడు, రారాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతించడం నన్ను కదిలించివేసింది. ఆయనకు నా కృతజ్ఞతలు” అంటూ ప్రధాని మోదీ ట్వటర్ వేదికగా వెల్లడించారు. కాగా, మోదీ తన యూఏఈ పర్యటనలో భాగంగా ఇటీవల దివంగతులైన యూఏఈ మాజీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు నివాళులు అర్పించారు

జర్మనీలో జరిగిన జీ-7 సమ్మిట్‌కు హాజరైన తర్వాత ప్రధాన మంత్రి అబుదాబికి చేరుకున్నారు. అక్కడ శిఖరాగ్ర సమావేశంలో అనేక మంది ప్రపంచ నాయకులతో సంభాషించారు. ప్రపంచ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో చర్చించారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. మేలో మరణించిన షేక్ ఖలీఫా అల్ నహ్యాన్, నవంబర్ 2004 నుండి యూఏఈ అధ్యక్షుడిగా, అబుదాబి పాలకుడిగా పనిచేశారు. అతని మరణం అనంతరం షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన పర్యటనలో షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధాని మోదీ అభినందించనున్నారు. యూఏఈ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో సమావేశం కావడం ఇదే తొలిసారి.