Site icon NTV Telugu

Covid Vaccination: కరోనా టీకాల వల్ల 2 కోట్ల మంది బతికిపోయారు

Covid Vaccination

Covid Vaccination

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మరణాల రేటు ఎక్కువగా నమోదైంది. అయితే కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకపోతే ఈ మరణాల రేటు భయంకరంగా ఉండేది. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కరోనాను నిరోధించినట్లు ది లాన్సెట్‌ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగిన మరణాలపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ నిపుణులు అధ్యయనం చేయగా.. ఈ సర్వేను ది లాన్సెట్ జర్నల్ బహిర్గతం చేసింది.

కరోనా టీకాల వల్ల భారత్‌లో ఒక్క ఏడాదిలోనే 42 లక్షల మరణాలు తగ్గాయని ది లాన్సెట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. డెల్టా వేరియంట్‌తో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న భారత్‌లో కరోనా టీకాల పంపిణీ ఎంతో ప్రభావాన్ని చూపించిందని అభిప్రాయపడింది. కరోనా మరణాల వాస్తవ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 14 లక్షల మరణాలు సంభవిస్తాయని భావించగా.. అందులో దాదాపు 2కోట్ల మరణాలను వ్యాక్సిన్‌లు నివారించగలిగినట్లు తాజా నివేదిక తెలిపింది. అటు భారత్‌లో కరోనా మహమ్మారి సమయంలో 51 లక్షల 60 వేల మరణాలు సంభవించి ఉండవచ్చనే అంచనాల ఆధారంగా ఈ నివేదికను తయారుచేసినట్లు లండన్ సైంటిస్టులు వెల్లడించారు. అమెరికాలో 19 లక్షలు, బ్రెజిల్‌లో 10 లక్షలు, ఫ్రాన్స్‌లో 6 లక్షల 31 వేలు, బ్రిటన్‌ 5 లక్షల మరణాలను వ్యాక్సిన్‌లు నివారించినట్లు వారు తమ నివేదికలో వివరించారు. 2021 చివరినాటికి ప్రతి దేశంలో కనీసం 40శాతం జనాభాకు వ్యాక్సిన్‌ అందించి ఉంటే దాదాపుగా మరో 6 లక్షల మరణాలు తగ్గి ఉండేవని సర్వే అభిప్రాయపడింది.

Exit mobile version