NTV Telugu Site icon

Turkey Earthquake: టర్కీ భూకంపంలో మృత్యుంజయులెందరో..

Turkey

Turkey

Turkey Earthquake: టర్కీ భూకంపంలో ఇప్పటికే మరణాల సంఖ్య 42,000లను దాటింది. గత వారం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. వెయ్యికి పైగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీతో పాటు సిరియా దేశం తీవ్రంగా దెబ్బతింది. గత దశాబ్ధాల్లో ఎన్నడూ లేని విధంగా టర్కీలోని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా.. ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి సమయంలో కూడా అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజులుగా ఎలాంటి నీరు, ఆహారం లేకుండా కొంత మంది మృత్యుంజయులుగా శిథిలాల నుంచి బయటపడుతున్నారు.

Read Also: BJP: ఢిల్లీలో ఆప్‌కు బీజేపీ షాక్.. హజ్ కమిటీ చైర్మన్‌గా కౌసర్ జహాన్

తాజాగా హతాయ్ ప్రాంతంలో అర్జెంటీనా రెస్క్యూ టీమ్ ముగ్గురిని సజీవంగా బయటకు తీసింది. తల్లితో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. ఎన్టీవీ ఎక్స్ క్లూసివ్ గా టర్కీ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఎన్టీవీతో మాట్లాడిని అర్జెంటీనా రెస్క్యూ టీం సభ్యుడు లూథర్ దీన్ని అద్భుతం అని కొనియాడారు. ముగ్గురిని సజీవంగా బయటకు తీసిన టీమ్ లో తాను ఉన్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. ముగ్గురు కూలిపోయిన భవనం కింద ఉందని బంధువులు సమాచారం ఇవ్వడంతో రెస్య్కూ ప్రారంభించామని.. మమ్మల్ని చూడగానే వారి కళ్లలో కనిపించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని లూథర్ అన్నారు.

మరోవైపు భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో టర్కీలో సహాయక చర్యలు ప్రారంభించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో టర్కీలో రెస్క్యూ ఆపరేషన్స్ ని ఎన్డీఆర్ఎఫ్ ముగించనుంది. రెండు బృందాలు ఈ రోజు భారత్ కు తిరిగి రానున్నాయని కంటింజెంట్ కమాండర్ గుర్మిందర్ సింగ్ ఎన్టీవీకి తెలిపారు. గత వారం నుంచి టర్కీలో భారత బృందాలు సహాయకార్యక్రమాలు అందిస్తున్నాయి. మొత్తం మూడు టీములు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల నుంచి ఇద్దరిని సజీవంగా రక్షించారు. 83 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రెస్క్యూ టీం ఈ నెల 18న ఇండియాకు తిరిగి రానుంది.