Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్‌పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!

  • ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
  • వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది
  • ఇరాన్‌పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
Trump5

Trump5

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు రోజుల పాటు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించిన అమెరికా.. తాజాగా మరోసారి 90 నిమిషాల పాటు భీకర వైమానిక దాడులు చేపట్టింది. ఇదే సమయంలో ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని కూడా తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రాకపోతే వచ్చే వారం పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారు. వచ్చే వారం ఇరాన్‌కు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు. చర్చల మార్గాన్ని తిరస్కరిస్తే అమెరికా మరింత విస్తృత స్థాయిలో సైనిక చర్యలకు దిగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఏప్రిల్‌లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం సుమారు 90 రోజుల పాటు ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలను తగ్గించింది. అయితే ఆ ఒప్పందం విఫలమైన తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి ఇరాన్‌పై అమెరికా వరుస వైమానిక దాడులు నిర్వహిస్తుండగా.. మరోవైపు ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధాన్ని కూడా అమలు చేస్తోంది. ఇరాన్‌ను తిరిగి చర్చల బల్లపైకి తీసుకురావడం, అణు కార్యక్రమంపై అమెరికా ఆందోళనలను పరిష్కరించేలా ఒత్తిడి తేవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. ఇప్పటికే అమెరికా ప్రతినిధులు ఇరాన్‌కు ఒప్పందం చేసుకోండి.. లేకపోతే మీ దగ్గర ఏమీ మిగలదు అనే స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు వెల్లడించారు.

వైట్‌హౌస్‌లో ప్రణాళికలు?

అమెరికా మీడియా కథనాల ప్రకారం.. వైట్‌హౌస్ సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన దాడులను మరింత విస్తరించే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోతే విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై కూడా భారీ దాడులు చేపట్టే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌లోని ‘‘పిక్‌యాక్స్ మౌంటెన్’’ భూగర్భ అణు కేంద్రాన్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా తెరవకపోతే అక్కడ కూడా భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో అమెరికా ఇప్పుడు సాధారణ సైనిక స్థావరాలతో పాటు అణు మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఇప్పటికే వరుసగా నాలుగు రోజుల పాటు ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, నౌకలపై దాడులకు ఉపయోగించే క్షిపణి స్థావరాలు, డ్రోన్ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అలాగే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడుల నేపథ్యంలో ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజా దాడులు పగటి సమయంలో నిర్వహించబడ్డాయి. ఇప్పటివరకు ఎక్కువగా రాత్రి వేళల్లోనే దాడులు జరగగా.. ఈసారి పగటిపూటే దాడులు జరపడం అమెరికా వ్యూహంలో కీలక మార్పుగా భావిస్తున్నారు. సెంట్కామ్ ప్రకారం.. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపర్చడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని వెల్లడించింది.

ఏం జరగబోతోంది?

అమెరికా ఒకవైపు చర్చలకు అవకాశం ఉందని చెబుతూనే.. మరోవైపు ఇరాన్ వెనక్కి తగ్గకపోతే సైనిక చర్యలను మరింత విస్తరిస్తామని స్పష్టం చేస్తోంది. ట్రంప్ హెచ్చరికలు, వరుస దాడులు, కొత్త లక్ష్యాలపై చర్చలు చూస్తుంటే.. హార్ముజ్ జలసంధి దాటి ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై కూడా అమెరికా దాడులు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి పూర్తి స్థాయి యుద్ధ దిశగా వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.