Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

  • ఒప్పందం లేకపోతే ఇరాన్‌పై మళ్లీ దాడి
  • ‘ఎపిక్ ఫ్యూరీ’ తరహాలో ట్రంప్ హెచ్చరిక
  • మధ్యంతర ఎన్నికల ప్రచారంలో వార్నింగ్
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. వాషింగ్టన్‌తో దౌత్య ఒప్పందానికి టెహ్రాన్ ముందుకు రాకపోతే మళ్లీ సైనిక దాడి చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే “మరో చిన్న ఎపిక్ ఫ్యూరీ” తరహా దాడి చేపట్టవచ్చని వార్నింగ్ ఇచ్చారు. ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ నాయకత్వంపై విమర్శలు చేస్తూ తన ప్రభుత్వ జాతీయ భద్రతా నిర్ణయాలను ప్రస్తావించారు. “ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే మరో చిన్న ఎపిక్ ఫ్యూరీ చేయాల్సి రావచ్చు.. లేకపోతే వాళ్లే ఒప్పుకుంటారు” అని ట్రంప్ అన్నారు. “వాళ్లు తెలివిగా ఉంటే ‘సరే.. చర్చలు మొదలుపెడదాం’ అంటారు. కానీ అలా చేస్తారో లేదో నాకు సందేహమే” అంటూ ఇరాన్ నాయకత్వంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

క్యూబాపైనా వ్యాఖ్యలు

ప్రసంగంలో ట్రంప్ కరీబియన్ ప్రాంతంలో ఉన్న అమెరికా నౌకాదళాన్ని కూడా ప్రస్తావించారు. మధ్యప్రాచ్యం నుంచి తిరిగి వస్తున్న యుద్ధ నౌకలు క్యూబా తీరానికి చేరుకోవచ్చని, అక్కడి నుంచి ఫ్లోరిడా సెనేటర్ మార్కో రుబియోను దౌత్యపరమైన చర్యల కోసం పంపుతామని వ్యాఖ్యానించారు. విదేశాల్లో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరులను స్వదేశానికి తీసుకురావడంలో తన ప్రభుత్వం విజయవంతమైందని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్ దగ్గర ఉన్న 28 మంది బందీలను వారి కుటుంబాలకు తిరిగి చేర్చామని.. జీవించి ఉన్నవారితో పాటు మృతదేహాలను కూడా అప్పగించారని చెప్పారు. అలాగే రష్యాలో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరుడు స్టీఫెన్ హబ్బార్డ్‌ను కూడా తిరిగి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

అమెరికాలో వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో నర్సుల కొరతను తీర్చేందుకు 250 మిలియన్ డాలర్ల ఫెడరల్ పెట్టుబడిని ప్రకటించారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా కనీసం 5,000 మంది కొత్త నర్సులను నియమిస్తామని, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తామని ట్రంప్ తెలిపారు.