అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల టర్కీలో జరిగిన నాటో సదస్సు నుంచి అమెరికాకు తిరిగి వస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భద్రతా కారణాలతో ట్రంప్ ప్రయాణిస్తున్న ప్రధాన అధ్యక్ష విమానాన్ని మార్చి.. మరో చిన్న సైనిక విమానంలో రహస్యంగా అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనతో పాటు ప్రయాణించాల్సిన వైట్‌హౌస్ ప్రెస్ పూల్, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది ఉన్న ప్రధాన విమానాన్ని ‘డికాయ్’గా ముందుగానే గాల్లోకి పంపినట్లు తెలుస్తోంది.
జూలై 8న టర్కీ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. అయితే జర్నలిస్టులు ప్రయాణిస్తున్న ప్రధాన విమానం డికాయ్‌గా పనిచేస్తున్న విషయాన్ని వారికి తెలియదని సమాచారం. విమానం కిటికీల తెరలను కిందకు దించాలని సిబ్బంది సూచించడంతో.. అందుకు కారణమేంటని జర్నలిస్టులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మనం ఎదుర్కోవాల్సిన కొంతమంది దుర్మార్గుల కారణంగా మీరు ప్రమాదకరమైన విమానంలో ఉండే అవకాశం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం సరదాగా.. ‘‘నేను వెళ్తే మీరు కూడా వెళ్తారు కదా?’’ అంటూ జర్నలిస్టులతో అన్నారు. ‘‘బహుశా ఏదో ఒక రోజు మీరు మీ వృత్తిని మార్చుకోవాలనుకోవచ్చు’’ అని కూడా చమత్కరించారు.
ఇరాన్ నుంచి ముప్పు?
‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం.. ట్రంప్ రహస్యంగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్ని మార్చడానికి ఇరాన్ నుంచి వచ్చిన ముప్పే కారణమని అమెరికా అధికారులు వెల్లడించారు. తమకు ఒక నిర్దిష్ట ముప్పు గురించి సమాచారం ఉందని ఇద్దరు అమెరికా అధికారులు తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఎయిర్‌ఫోర్స్ వన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణితో దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారాన్ని అధికారులు అందుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాటో సదస్సు జరిగిన ప్రాంతానికి సమీపంలో భుజం నుంచి ప్రయోగించే క్షిపణిని కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించినట్లు మరో ముప్పు గురించి కూడా సమాచారం వచ్చినట్లు కథనాలు వెల్లడించాయి.
ట్రంప్ సాధారణంగా అధ్యక్ష విమానంలోకి ఎక్కే సమయంలో కెమెరాలు, ఫొటోగ్రాఫర్లకు కనిపించారు. ఏఎఫ్‌పీ విడుదల చేసిన చిత్రాల్లో విమానం ముందు, వెనుక భాగాల్లో హైడ్రాలిక్ లిఫ్టులపై రెండు సరఫరా కంటైనర్లు కనిపించాయి. అనంతరం ట్రంప్ వేగంగా విమానం నుంచి బయటకు వచ్చి వాటిలోని ఓ కార్గో కంటైనర్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఆ కంటైనర్ ద్వారా సమీపంలో సిద్ధంగా ఉంచిన చిన్న అమెరికా వైమానిక దళ విమానంలోకి ఆయన చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ట్రంప్‌తో నేరుగా ప్రయాణించే అవకాశం లేని ప్రత్యేక విభాగంలో సుమారు 12 మంది జర్నలిస్టులు ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ఉన్నారు. విమానం మార్చిన విషయం వారికి తెలియకుండానే వారు అదే విమానంలో టర్కీ నుంచి బయలుదేరారు. ఆ సమయంలో అమెరికాతో యుద్ధ పరిస్థితుల్లో ఉన్న ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న సమాచారంపై వారికి అవగాహన లేకపోవడం గమనార్హం.
అయితే తనతో పాటు రాని జర్నలిస్టులు ప్రయాణించిన ‘డికాయ్ విమానం’పై ఉన్న ముప్పును ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు. ‘‘నిజానికి నేను ప్రయాణించిన విమానానికే ఎక్కువ ప్రమాదం ఉందని నేను భావిస్తున్నాను’’ అని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. అయితే తనకు ఎలాంటి భయం కలగలేదని స్పష్టం చేశారు. ‘‘నిజం చెప్పాలంటే నేను దేనికీ భయపడను. ఏది జరిగినా సరే. నా వైఖరి ఏంటంటే.. ఏదైనా జరగనీ!’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Reporter on Air Force One: “Do you know why they had us close our window blinds?”
Trump: “Because you’re probably on a dangerous flight… because of the sleezebags that we have to deal with.” pic.twitter.com/AAkyC4w4oy
— ALX 🇺🇸 (@alx) July 9, 2026

