ఇరాన్‌ను చిత్తుగా ఓడించామని.. ఇంకొంచెం ముందుకు వెళ్లొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. టెహ్రాన్‌పై తమ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని సమర్థించుకున్న ఆయన.. అవసరమైతే ఇరాన్‌పై మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో అమెరికా అధ్యక్షులు చేయాల్సిన పనులను తాను ఇప్పుడు చేస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయాలను కొందరు వ్యతిరేకించినప్పటికీ.. దేశభక్తులు సహా చాలామంది వాటికి మద్దతు ఇస్తున్నారని అన్నారు.
అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను పెంచేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో చమురు సరఫరాలకు సంబంధించి ఆందోళనలు సృష్టించేందుకు ఇరాన్ తప్పుడు దాడులు, మందుపాతరల ఘటనలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రస్తుతం సంఘర్షణ ప్రారంభానికి ముందు కంటే ఎక్కువ చమురు రవాణా జరుగుతోందని పేర్కొన్నారు.
ఇరాన్ పాలక వ్యవస్థపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. నిరసనకారులు, తమకు అడ్డుగా వచ్చిన ఇతరులను ఇరాన్ ప్రభుత్వం చంపుతోందని ఆరోపించారు. ఆ దేశ పాలక వ్యవస్థను ‘దుష్ట పాలన’గా అభివర్ణించారు. “ఏడు నెలలలోపే 75 వేల మంది నిరసనకారులు మరణించారు” అని ట్రంప్ పేర్కొన్నారు.

