అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఎలాంటి టోల్ ఫీజులు, బీమా ఛార్జీలు లేదా ఇతర రుసుములు విధించబోమని ఇరాన్ అమెరికాకు హామీ ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ హామీ అసత్యమని తేలితే చర్చలను వెంటనే నిలిపివేస్తామని హెచ్చరించారు.
ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఎలాంటి టోల్, ఇన్సూరెన్స్ ఖర్చులు లేదా ఇతర రుసుములు వసూలు చేయబోమని ఇరాన్ అమెరికాకు స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ మాత్రమే’’ అని పేర్కొన్నారు. అలాగే ఇరాన్ హామీపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ‘‘ఈ సమాచారం తప్పు అని తేలితే చర్చలు వెంటనే ముగుస్తాయి’’ అని ట్రంప్ హెచ్చరించారు.
ప్రపంచ ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణాలో సుమారు 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇటీవల ఇరాన్, ఒమన్ సంయుక్త ప్రకటనలో జలసంధి నిర్వహణకు సంబంధించిన సేవల ఖర్చులను పరిశీలిస్తామని పేర్కొనడంతో అమెరికా, గల్ఫ్ దేశాల్లో ఆందోళన వ్యక్తమైంది. హార్ముజ్ తిరిగి తెరుచుకున్న తర్వాత ఇరాన్ నౌకలపై పరోక్షంగా రుసుములు విధించే అవకాశముందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ అవకాశాన్ని తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది అంతర్జాతీయ జలమార్గం. అంతర్జాతీయ జలమార్గంలో ఎలాంటి దేశం టోల్ లేదా రుసుములు విధించే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు.
ఇరాన్‌కు అమెరికా నేరుగా నిధులు విడుదల చేసిందనే వార్తలను కూడా ట్రంప్ ఖండించారు. ‘‘అమెరికా నుంచి ఇరాన్ ప్రభుత్వానికి ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. వారి నిధులను కూడా నేరుగా విడుదల చేయలేదు’’ అని తెలిపారు. అయితే అమెరికా నియంత్రణలో ఉన్న కొన్ని ఇరానియన్ నిధులను మానవతా అవసరాల కోసం వినియోగించే అవకాశం ఉందని చెప్పారు. ‘‘మా నియంత్రణలో ఉన్న కొంత డబ్బును అమెరికా రైతులు, పశుపోషకుల నుంచి మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగిస్తాం’’ అని వెల్లడించారు.
స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కీలక చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఆంక్షల సడలింపులు, సముద్ర భద్రత వంటి అంశాల్లో కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ.. అణు కేంద్రాల తనిఖీలు, ఇరాన్ క్షిపణి కార్యక్రమం వంటి కీలక అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్నాయని ఇరు దేశాలు చెబుతుండగా.. హార్ముజ్ జలసంధి, అణు తనిఖీలు వంటి అంశాలు తుది ఒప్పందానికి ప్రధాన సవాలుగా మారాయి.

