Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన

  • మరోసారి ఇరాన్-అమెరికా మధ్య చర్చలు
  • ఇరాన్ చర్చలకు పిలిచిందన్న ట్రంప్
  • దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
  • అబ్బే... అదేమీలేదంటూ ఇరాన్ వెల్లడి
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌తో చర్చలు జరగనున్నాయని ప్రకటించారు. ఇరాన్ స్వయంగా తాజా చర్చలకు అభ్యర్థించిందని.. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో కీలక సమావేశం జరగనుందని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. ‘‘ఇరాన్ సమావేశాన్ని కోరింది. రేపు దోహాలో ఆ భేటీ జరుగుతుంది!.’’ అంటూ పోస్టులో పేర్కొన్నారు.

అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం ఈ వారం అమెరికాతో ఎలాంటి సాంకేతిక స్థాయి సమావేశాలు జరగవని స్పష్టం చేసింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ మాట్లాడుతూ.. ‘‘ఈ వారం వర్కింగ్ గ్రూపుల సాంకేతిక సమావేశాలు ఏవీ లేవు’’ అని ప్రభుత్వ టెలివిజన్‌కు తెలిపారు.

ప్రధాన అంశం ఇదే

అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా జరగనున్న చర్చల్లో హార్ముజ్ జలసంధి అంశమే ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచ చమురు, ద్రవీభవన సహజవాయువు (LNG) సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతోంది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడుల తర్వాత పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

అయితే దోహాలో మంగళవారం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశముందని అమెరికా మీడియా ఇప్పటికే కథనాలు ప్రచురించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ ఈ భేటీలో హార్ముజ్ జలసంధి వివాదంపై చర్చలు జరుగుతాయని పేర్కొంది. అలాగే సీఎన్‌ఎన్ కూడా ట్రంప్ ప్రభుత్వ అధికారుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇలాంటి సమాచారం వెల్లడించింది. అయితే ట్రంప్ సోషల్ మీడియా పోస్టుకు ముందు వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

హార్ముజ్ జలసంధిలో నౌకాయానంపై తమకే అధిక నియంత్రణ ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. తాము సూచించిన సముద్ర మార్గాన్ని వదిలి ఇతర మార్గాల్లో నౌకలు ప్రయాణిస్తే ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ అమలు చేస్తున్న విధానాలకు భిన్నంగా కొత్త ఏర్పాట్లు చేయాలనే ప్రయత్నాలు పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడంలో ఆలస్యం జరుగుతుంది. అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.’’ అని అన్నారు.

ఖతార్ కీలక మధ్యవర్తి

అమెరికా-ఇరాన్ చర్చల్లో ఖతార్‌తో పాటు పాకిస్థాన్ కూడా కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఖతార్‌లో నిల్వ ఉన్న ఇరాన్ నిధుల విడుదల అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఖతార్‌లో నిల్వ ఉన్న మొత్తం 12 బిలియన్ డాలర్లలో తొలి విడతగా 6 బిలియన్ డాలర్లు ఇరాన్‌కు విడుదల కానున్నాయి.’’ అని వెల్లడించారు.

ట్రంప్ ప్రకటించినట్లుగా మంగళవారం దోహాలో సమావేశం నిజంగా జరిగితే.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందా? లేక గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయా? అన్నదానిపై ఈ సమావేశం కీలకంగా మారనుంది.