పశ్చిమాసియాలో మరోసారి రణరంగం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మధ్యప్రాచ్యం బుధవారం మరోసారి బాంబ్ దాడులతో దద్దరిల్లింది. మంగళవారం హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. దీంతో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియా దాడులతో రగిలిపోతుంది.
నాటో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం అధ్యక్షుడు ట్రంప్ టర్కీకి చేరుకున్నారు. బుధవారం అంకారాలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్‌ఫైర్), అవగాహన ఒప్పందం (MoU) ఇప్పుడు ముగిసినట్లేనని ప్రకటించారు. ఇకపై ఇరాన్‌తో చర్చలు కొనసాగించే ఆసక్తి తమకు లేదని స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్‌పై అమెరికా జరిపిన వైమానిక దాడులను సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘గత రాత్రి ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన దాడులు చేశాం. అక్కడి నాయకత్వంలో ఏదో తేడా ఉంది. వారు ప్రమాదకరమైన వ్యక్తులు. ఇరాన్‌పై అవసరమైతే మళ్లీ మళ్లీ కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడమే అమెరికా లక్ష్యమని.. అవసరమైతే మరిన్ని సైనిక చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై బుధవారం భారీ దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు కొనసాగిస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. దీనిపై స్పందించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. అమెరికానే అవగాహన ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. దేశ భద్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, అమెరికా చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర 5.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.09 డాలర్లకు చేరుకోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 5.4 శాతం పెరిగి 74.23 డాలర్లకు చేరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ఇంధన మార్కెట్లలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం
ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 1,506 పాయింట్లు పడిపోయి 76,673 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 461 పాయింట్లు నష్టపోయి 23,937 దగ్గర ట్రేడయ్యాయి. మెటల్, ఫార్మా, రియాల్టీ రంగాలను మినహాయించి మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో కొనసాగాయి.
ఇక నాటో దేశమైన స్పెయిన్‌పై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌కు సంబంధించిన సైనిక చర్యల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలు, గగనతలాన్ని వినియోగించేందుకు స్పెయిన్ నిరాకరించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్‌కు స్పెయిన్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు.
నాటోపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి
నాటో కూటమిపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇరాన్ అంశంలో అమెరికాకు మద్దతు ఇవ్వడంలో నాటో విఫలమైందని ఆరోపించారు. ‘‘నాటోపై నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. ఇరాన్ వంటి ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంపై చర్యల్లో మాకు సహకరించలేదు. అలాగే గ్రీన్‌ల్యాండ్ అంశంలోనూ నాటో వైఖరి నన్ను నిరాశపరిచింది. గ్రీన్‌ల్యాండ్ అమెరికాకు చెందాల్సిందేనని.. స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదు.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా తాజా దాడులు, ట్రంప్ చేసిన కఠిన వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

