Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానురీతిలో పలు దేశాలపై సుంకాలు విధించడాన్ని ఇటీవల అమెరకన్ ఫెడరల్ అప్పీల్ కోర్టు తప్పు పట్టింది. అయితే, ఈ తీర్పును ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతోంది. కోర్టులో పిటిషన్ వేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఈ సుంకాలను ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ని లింక్ చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి కోసం మా ప్రయత్నంలో కీలకమైన అంశం’’ అని సుంకాలను సమర్థిస్తూ వాదించింది.
‘‘ ఉక్రెయిన్ లో శాంతి కోసం ఆయన(ట్రంప్) చేసే ప్రయత్నంలో కీలకం అంశంగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై IEEPA సుంకాలను విధించేందుకు అధ్యక్షుడు ఇటీవల అధికారం ఇచ్చారు’’ అని ట్రంప్ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఆగస్టు 27న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలను విధించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి సహకరిస్తున్నందున 25 శాతం, పరస్పర సుంకాల పేరుతో మరో 25 శాతం సుంకం విధించారు. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా అత్యధికంగా భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు షాకిచ్చిన చైనా, కలల ప్రాజెక్టుకు మద్దతు కరువు..
ఇదే కాకుండా, సుంకాలతో అమెరికా ధనిక దేశంగా ఉంటుందని, లేకుంటే పేదదేశంగా మారుతుందని పిటిషన్‌లో పేర్కొంది. ఏడాది క్రితం అమెరికా ఒక చనిపోయిన దేశం, ఇప్పుడు యూఎస్‌ని సుంకాల పేరుతో దుర్వినియోగం చేసిన దేశాలు ట్రిలియన్ డాలర్లు చెల్లించడం వల్ల అమెరికా బలమైన, ఆర్థికంగా లాభదాయకమైన, గౌరవనీయమైన దేశంగా మారిందని పిటిషన్ పేర్కొంది.
గత వారం, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసిన ట్రంప్ సుంకాల విధానం చట్టవిరుద్ధం అని యూఎస్ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అక్టోబర్ వరకు ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లడానికి సమయం ఇవ్వడానికి సుంకాలు అమలులో ఉండటానికి అనుమతి ఇచ్చింది. ప్రెసిడెంట్ హోదాలో అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించడంలో ట్రంప్ తన అధికారాన్ని అధిగమించారని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ తీర్పుపై తాము సుప్రీంకోర్టులో పోరాడుతామని ట్రంప్ చెప్పారు.
