Trump: ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన

  • ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది
  • ట్రంప్ సంచలన ప్రకటన
  • తాత్కాలిక ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణ
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై అమెరికా నియంత్రణ చేపడుతుందని ప్రకటించారు. ఈ జలసంధి భద్రతను అమెరికా చూసుకుంటుందని, భవిష్యత్తులో అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి రక్షణ రుసుము కూడా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పారు. అదే సమయంలో ఇరాన్ తమ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు.

ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘హార్ముజ్ జలసంధిని మేమే స్వాధీనం చేసుకుంటున్నాం. దాన్ని మేమే నిర్వహిస్తాం. ఆ జలసంధికి అమెరికానే సంరక్షకురాలిగా ఉంటుంది. కావాలంటే ‘గార్డియన్ ఏంజెల్ ఆఫ్ ది స్ట్రైట్’ అని కూడా పిలవొచ్చు. అందుకు మాకు తగిన ప్రతిఫలం కూడా రావాలి.’’ అని వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘మా మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఇరానే.’’ అని ట్రంప్ ఆరోపించారు.

ట్రంప్ వ్యాఖ్యల మధ్యే అమెరికా, ఇరాన్ మరోసారి పరస్పరం క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకారం.. బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఒమాన్‌లో రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌లో ఇంధన నిల్వలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అయితే బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ ప్రభుత్వాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించాయి.

మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్.. ఇరాన్‌పై మరో విడత దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ స్థావరాలు, చిన్న నౌకలను లక్ష్యంగా చేసుకుని వైమానిక, నౌకాదళ దాడులు చేపట్టినట్లు తెలిపింది. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకునే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యమని అమెరికా పేర్కొంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. దీంతో అక్కడ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనం ప్రకారం.. జలసంధిలో అక్రమంగా ప్రయాణిస్తున్నాయని ఆరోపిస్తూ రెండు నౌకలపై హెచ్చరిక కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఆ కాల్పుల అనంతరం ఆ నౌకలు ప్రయాణాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది. అయితే అమెరికా మాత్రం హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలు అమెరికా రక్షణలో కొనసాగుతున్నాయని చెబుతోంది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అలాగే ఇరాన్‌లోని చమురు ఉత్పత్తి ప్రాంతమైన ఖుజెస్టాన్ ప్రావిన్స్‌లో అమెరికా దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడినట్లు ఇరాన్ వార్తాసంస్థలు తెలిపాయి.

చమురు ధరలకు మళ్లీ ఊపు

గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక దశలో 5 శాతం వరకు పెరిగాయి. అనంతరం కొంత తగ్గినా 3.5 శాతం లాభాల్లో కొనసాగాయి. అమెరికా బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ దౌత్య చర్చలు మాత్రం కొనసాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది. ఖతర్, పాకిస్థాన్, ఒమాన్ మధ్యవర్తులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. అమెరికా తమ బాధ్యతలను పాటించకపోతే గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని (MoU) అమలు చేయబోమని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. అయితే ట్రంప్ మాత్రం ‘‘ఇరాన్ దాదాపు అన్ని విషయాల్లో అంగీకరించింది. కానీ చివరి నిమిషంలో డ్రోన్‌తో ఓ నౌకపై దాడి చేసి ఒప్పందాన్ని ఉల్లంఘించింది.’ఈ అంటూ మరోసారి టెహ్రాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.