ప్రస్తుతం ఇరాన్‌లో మాజీ సుప్రీం లీడర్, దివంగత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు పవిత్ర స్థలాల సందర్శనార్థం జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయా దేశాలకు చెందిన పెద్దలు ఖమేనీకి నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి తరుణంలో ట్రంప్ సెటైర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఖమేనీ అంత్యక్రియల కోసం అమెరికా ఉద్దేశపూర్వకంగానే వారం రోజుల సమయం ఇచ్చిందని.. మేము మంచి వాళ్లం కాబట్టే అలా చేశామంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవం సందర్భంగా మౌంట్ రష్‌మోర్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి మేము వారికి వారం రోజుల విరామం ఇచ్చాం. ఎందుకంటే మేము మంచి మనసున్న వాళ్లం. ఇది నిజం.’’ అని అన్నారు. అంతేకాకుండా అమెరికా దాడులతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతిందని.. ఇప్పుడు ఒప్పందం కోసం ఆ దేశమే ఆత్రుతగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ను మేము పూర్తిగా దెబ్బతీశాం. ఇప్పుడు వారు ఎలాగైనా చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవాలని తహతహలాడుతున్నారు.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించిన మాజీ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ శనివారం అధికారికంగా ప్రారంభించింది. 86 ఏళ్ల వయసులో మరణించిన ఖమేనీ 36 సంవత్సరాల పాటు ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగి… పశ్చిమాసియాలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న నేతగా గుర్తింపు పొందారు.
ఖమేనీ అంత్యక్రియలు అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభం కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ తేదీని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. టెహ్రాన్‌లో అంత్యక్రియలకు హాజరైన ప్రజలు ‘‘అమెరికా నశించాలి’’ అంటూ నినాదాలు చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా వ్యతిరేకతకు ప్రతీకగా మారిన ఈ నినాదాలు మరోసారి మార్మోగాయి.
జూలై 9న అంత్యక్రియలు పూర్తి
ఖమేనీ భౌతికకాయాన్ని ప్రస్తుతం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. సోమవారం టెహ్రాన్‌లో భారీ అంతిమయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం ఖోమ్, బాగ్దాద్, కర్బలా, నజఫ్ నగరాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి.. జూలై 9న మష్హద్‌లోని ఇమామ్ రెజా దర్గా దగ్గర ఖననం చేయనున్నారు.
ప్రపంచ నేతల నివాళులు
ఖమేనీ అంత్యక్రియలకు ప్రపంచంలోని పలుదేశాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్, న్యాయవ్యవస్థ అధిపతి ఘోలామ్ హొస్సేన్ మొహ్సేని ఎజేయి, ఎక్స్‌పిడియెన్సీ కౌన్సిల్ చైర్మన్ అయతొల్లా సాదెక్ అమోలి లారిజానీ తదితరులు నివాళులర్పించారు.
కొత్త సుప్రీం నాయకుడిపై ఆసక్తి
ఖమేనీ మరణం అనంతరం కొత్త సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ బహిరంగంగా కనిపించలేదు. దాడుల్లో ఆయన కూడా గాయపడినట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన లిఖితపూర్వక ప్రకటనల ద్వారానే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం, భవిష్యత్ నాయకత్వంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
President Trump on Iran:
We knocked the hell out of Iran. They are dying to settle. They want to settle so badly.
We gave them a week off for a funeral because we’re nice — that's true. pic.twitter.com/hQop9PaBLH
— Tabz (@TabzLIVE) July 4, 2026

