NTV Telugu Site icon

Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి బందీలుగా చేసుకున్న ఇజ్రాయిలీల విడుదలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల ఉంటుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ నుంచి బందీలను తిరిగి తీసుకురావడంలో మేము పురోగతి సాధిస్తున్నామని మంగళవారం చెప్పారు. ‘‘త్వరలోనే శుభవార్త వస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని ఉత్తరాన ఉన్న సైనిక స్థావరాన్ని సందర్శించిన సమయంలో సైనికులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మా బందీల విదులకు సంబంధించిన పరిణామా దృష్ట్యా మంగళవారం సాయంత్రం వార్ క్యాబినెట్, సెక్యూరిటీ క్యాబినెట్ మరియు ప్రభుత్వం వరసగా సమావేశం కానున్నాయి’’ అని కొద్దిసేపటి తర్వాత ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Read Also: National Herald case: రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..

అక్టోబర్7 నాడు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 1200 మంది మరణించారు. 240 మంది ఇజ్రాయిలీ పౌరులను కిడ్నాప్ చేసి గాజాలోకి తరలించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ స్థావరాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేల మంది సాధారణ పౌరులు మరణించారు. తాజాగా బందీల విడుదలపై ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఖతార్ తో పాటు హమాస్ అధిపతి కూడా వెల్లడించాడు.

ఇదిలా ఉంటే తాజాగా చేసిన నెతన్యాహు వ్యాఖ్యల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావించలేదు. ‘‘మేము భద్రతను పునరుద్ధరించాలనుకుంటున్నాము. మేము చర్యలు తీసుకుంటాము. దక్షిణం, ఉత్తరం రెండింటిపై భద్రతను పెంచుతాము’’ అని అన్నారు. ఇజ్రాయిల్-లెబనాన్ సరిహద్దు్ల్లో పోరాడుతున్న సైనికులకు వందనం చేయాలనుకున్నానని నెతన్యాహు అన్నారు.