అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. ప్రస్తుతం ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఈ మేరకు ట్రంప్ మెజారిటీ సీట్లను సాధించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇక రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న ట్రంప్ సరికొత్త రికార్డు సృష్టించారు. 132 ఏళ్ల నాటి రికార్డుతో సహా అనేక చారిత్రాత్మక అంశాలు నమోదు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఒక నేత అధ్యక్ష పదవి చేపట్టి.. మళ్లీ రెండోసారి ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలై మూడోసారి పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. గత 132 ఏళ్ల అమెరికా చరిత్రలో అలాంటి పరిణామం ఇప్పటి వరకూ చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ఆ రికార్డును ట్రంప్ సాధించారు. దాదాపు 132 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్రను నమోదు చేశారు.
గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్.. 1884 ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 1888 మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 1992లో మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ట్రంప్ ఆ ఘనత సాధించారు. గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత యూఎస్ ఎన్నికల్లో ఈ విధంగా గెలుస్తున్న రెండో వ్యక్తిగా ట్రంప్ నిలిచారు.
గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్.. యూఎస్ 22, 24వ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 1885 నుంచి 1889 వరకు, 1893 నుంచి 1897 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటి పదవీకాలం 2016- 2020 మధ్య జరిగింది. 2020లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. తిరిగి రెండవ పర్యాయం గెలవలేకపోయారు. మళ్లీ 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. భారీ విక్టరీని నమోదు చేశారు. అమెరికా ఓటర్లంతా ఏకపక్షంగా ఓట్లు వేశారు. గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత ట్రంప్ మాత్రమే ఆ విజయం నమోదు చేశారు. అంటే 132 ఏళ్ల రికార్డును తిరిగి ట్రంప్ బద్ధలుకొట్టారు. ఇదిలా ఉంటే న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… 20 ఏళ్లలో ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్‌గా ట్రంప్ అవతరించారు.