China: చైనాలో ముస్లింలపై అణిచివేత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో నివసించే ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇస్లాంను ఆచరించకుండా అక్కడి ప్రజలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా చైనా అధికార యంత్రాంగా వీగర్ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదు రేడియో ఫ్రీ ఏషియా తన కథనంలో పేర్కొంది. ఏప్రిల్ 20-21 తేదీల్లో రంజాన్ సందర్భంగా స్థానిక మసీదుల్లో 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతించింది. ఇలా అనుమతి పొందిన వారిపై కూడా అధికారులు నిఘా పెట్టారు. జిన్జియాంగ్ ప్రావిన్సులోని పలు ప్రాంతాల్లో భారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేశారు. చివరకు ఇళ్లలో ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారా..? అని నిఘా పెట్టారు.
Read Also: Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. తొమ్మది మంది మృతి
అయితే చైనా ప్రభుత్వం మాత్రం మతపరమైన తీవ్రవాదాన్ని అణిచివేసేందుకే ఇలా చేస్తున్నాం అంటూ తన చర్యలను సమర్థించుకుంది. యార్క్ వ్రుక్ పట్టణంలో ఈద్ ప్రార్థనలకు కేవలం ఒకే మసీదును తెరిచారు. బులుంగ్ పట్టణంలోని బేకౌంటీ ప్రాంతం 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని మాత్రమే మసీదుల్లోకి అనుమతించారు. వీరిని గమనించడానికి పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. చైనా ప్రభుత్వం 2017 నుంచి జాతి, మతపరమైన ఆచారాలను పాటించడంపై నిషేధం విధించింది. ఇదిలా ఉంటే గతేడాది ఇస్లాంలో మార్పులు చేయడానికి చైనా ప్రయత్నం చేసింది. ‘‘దేశభక్తి చాటుకోండి.. చైనా నియమాలకు అనుగుణంగా ఇస్లాంను మార్చుకోండి’’ అంటూ పిలుపునిచ్చింది.
చైనాలో 2.5 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో ముస్లింల సంఖ్య అధికం. ఇక్కడ వీగర్ ముస్లింల ప్రతీ కదలికను చైనా నిశితంగా గమనిస్తుంటుంది. ఈ ప్రాంతంలో 1.2 కోట్ల మంది వీగర్లు నివసిస్తున్నారు. వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చైనా ఆరోపిస్తూ, వీరిని నిర్భంధానికి గురి చేస్తోంది. వీగర్ ముస్లింలపై చైనా అణిచివేత, మానవహక్కుల ఉల్లంఘనపై పాశ్చాత్య దేశాలు స్పందిస్తున్నా.. చైనా వాటిని ఏమాత్రం లెక్కచేయడం లేదు.
