NTV Telugu Site icon

Usha chilukuri: అమెరికా సెకండ్ లేడీగా ఆంధ్రా అమ్మాయి.. ఏపీలో ఎక్కడంటే..!

Usha Chilukurijdvance

Usha Chilukurijdvance

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో గ్రాండ్ విక్టరీని అందుకున్నారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ అల్లుడే కాబోతున్నారు. ఉపాధ్యక్షుడిగా జెడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమలాహారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఇప్పుడు కూడా తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. దీంతో ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి పేరు ఏపీలో మార్మోగుతోంది.

ఉషా చిలుకూరి… విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడింది. ఉష పూర్వీకుల మూలాలు కష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. విశాఖపట్నంలోనూ ఆమెకు బంధువులున్నారు. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ సి శాంతమ్మ (96)కు ఉష మనవరాలు వరుస అవుతారు. భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి ద్వారా ఉషతో తనకు కుటుంబ సంబంధం ఉందని, ఆమె తనకు మనవరాలు అవుతుందని శాంతమ్మ తెలిపారు. ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన తమ మరిది రామశాస్త్రి మనవరాలే ఆమె అని శాంతమ్మ చెప్పారు. రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. శాన్‌ డియాగోలో ఇంజనీరింగ్‌, మాలిక్యులర్‌ బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తే ఉషా చిలుకూరి. ఆమె భర్త జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు.

కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌, జస్టిస్‌ బ్రెట్‌ కెవానా దగ్గర విధులు నిర్వర్తించారు. పటిష్ఠమైన విద్యా నేపథ్యమున్న ఆమె.. యేల్‌ విశ్వవిద్యాలయంలో లా అండ్‌ టెక్‌ జర్నల్‌కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా, యేల్‌ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాలుగేళ్ల పాటు అదే విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం కేంబ్రిడ్జి యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్‌-వింగ్‌, లిబరల్‌ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. యేల్‌ లా స్కూల్‌లోనే ఉషా, జె.డి.వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2014లో కెంటకీలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు.

 

 

Show comments