Site icon NTV Telugu

Afghanistan: మహిళలు చదువు కోవాలంటే ఆఫ్ఘాన్ లోనే.. విదేశాలకు నో అంటున్న తాలిబన్లు

Womens In Taliban Rule

Womens In Taliban Rule

Taliban refuses female students to leave Kabul for studies: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన ప్రారంభం అయి ఏడాది గడిచింది. 2021 ఆగస్టులో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అప్పటి నుంచి స్త్రీలపై వివక్ష చూపిస్తున్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం అవుతున్నారు. స్త్రీ విద్యను వ్యతిరేకిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా కుటుంబంలోని మగవాళ్ల తోడు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. షరియా చట్టాన్ని అమలు చేయడానికే తాలిబన్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే మహిళా విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నారు తాలిబన్ పాలకులు. అయితే చాలా మంది విద్యార్థిని, విద్యార్థులు రాజధాని కాబూల్ ను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం మగవాళ్లకు అనుమతి ఇచ్చి మహిళా విద్యార్థినులకు పర్మిషన్ ఇవ్వడం లేదు. కనీసం ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు బయటకు వెళ్లి పని చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు తాలిబన్ ప్రభుత్వం. కొన్ని ప్రావిన్సుల్లో మాత్రం అక్కడక్కడ విద్యను అభ్యసించడానికి అనుమతించారు. అది కూడా కఠిన నిబంధనల మధ్య. ఆడపిల్లలు కేవలం ఆరో తరగతికి మించి చదువుకోకూడదని ఆదేశాలు ఇస్తున్నారు.

Read Also: KTR: నా పేరుతో కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? నా దృష్టిలే అమ్మే నా దేవత..!

ప్రస్తుతం మహిళలు, బాలికలు ఆఫ్ఘాన్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మహిళలు ఉద్యోగాలు చేయకుండా నిరోధించారు.. మహిళా హక్కులకు అసలు విలువే లేదు. దీంతో పాటు బాలికల నిర్భందం, బలవంతపు వివాహాలు పెరిగాయి. అనాగరిక చట్టాలను అమలు చేస్తుండటంతో విదేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు సాయం దక్కడం లేదు. అధికారం చేజిక్కించుకునే ముందు బాలిక విద్యా, హక్కుల గురించి హామీలు ఇచ్చిన తాలిబన్లు ఆ తరువాత వీటిని పట్టించుకోవడం లేదు. మరో వైపు పేదరికం పెరిగింది.దీంతో ప్రజలు కిడ్నీలను అమ్ముకుంటున్నారు.. తమ పిల్లలను కూడా అమ్ముకునే దుస్థితి దాపురించింది. తాలిబాన్ పాలనలో మహిళలు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడాన్ని వ్యతిరేకించారు. ఆఫ్ఘన్ మీడియాలో పని చేస్తున్న 80 శాతం మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. దేశంలో 1.8 కోట్ల మంది మహిళలు ఆరోగ్యం, విద్య, సామాజిక హక్కులకు దూరం అవుతున్నారు.

Exit mobile version