Taliban Bans Women From Working In NGOs: మహిళల స్వేచ్ఛపై మరోసారి తాలిబాన్ పాలకులు ఉక్కుపాదం మోపారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేశారు. బయటకు వెళ్లాలన్నా పూర్తిగా హిజాబ్ ధరించి, కుటుంబంలోని మగవారిని తోడు తీసుకెళ్లాలనే నియమాలను విధించారు. ఇదిలా ఉంటే మరోసారి మహిళలపై ఆంక్షలు విధించింది అక్కడి తాలిబాన్ గవర్నమెంట్.
Read Also: Jammu Kashmir: పాకిస్తాన్ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
దేశ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలు(ఎన్జీవో)ల్లో మహిళ ఉద్యోగులు పనులకు రాకుండా ఆపాలని తాలిబాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఎన్జీవోల్లో మహిళలపై నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మహిళ ఉద్యోగులను పనిలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవ చేస్తున్న ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయో లేదో స్పష్టంగా తెలియజేయలేదు.
ఇప్పటికే ఆఫ్ఘన్ వ్యాప్తంగా మహిళా విద్యార్థినులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు యూనివర్సిటీల్లో మహిళల విద్యను నిషేధిస్తూ ఇటీవల తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ తో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మహిళల విద్యపై ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఎన్జీవోల్లో పనిచేసే మహిళ ఉద్యోగులపై బ్యాన్ విధించారు.