Site icon NTV Telugu

Bashar al-Assad: సిరియా అధ్యక్షుడు అస్సాద్ దేశం విడిచిపెట్టాడు: రష్యా..

Bashar Al Assad

Bashar Al Assad

Bashar al-Assad: తిరుగుబాటుతో సిరియా రెబల్స్ హస్తగతమైంది. ఇప్పటికే ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్స్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో 24 ఏళ్లుగా సిరియాను పాలిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగిసింది.

Read Also: IND vs BAN U19 Final: ఫైనల్‌లో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. ఆసియాకప్ విజేతగా బంగ్లాదేశ్

రెబల్స్ దూకుడుతో సిరియర్ బలగాలు, వారికి అండగా నిలిచిన రష్యన్ బలగాలు తోకముడిచాయి. అధికారం పోవడం ఖాయంగా కనిపించడంతో అస్సాద్ తన భార్య, పిల్లల్ని ఇప్పటికే రష్యాకు తరలించారు. తాజాగా ఆయన కూడా దేశం వదిలిపెట్టినట్లు రష్యా వెల్లడించింది. శాంతియుతంగా అధికారాన్ని అప్పగించాలనే ఆదేశాలు ఇవ్వడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ తన పదవి నుంచి దిగిపోయి, దేశం వదిలిపెట్టినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పలేమని, అతని నిష్క్రమణకు సంబంధించిన చర్చల్లో రష్యా పాల్గొనలేదని పేర్కొంది. సిరియాలోని రష్యా సైనిక స్థావరాలను హైఅలర్ట్‌లో ఉంచామని, ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని చెప్పింది. మాస్కో అన్ని సిరియన్ ప్రతిపక్ష సమూహాలతో టచ్‌లో ఉన్నామని, హింసను మానుకోవాలని అన్ని పక్షాలను కోరింది.

ఇదిలా ఉంటే, ఈ రోజు దేశం విడిచివెళ్తున్న క్రమంలో బషర్ అల్ అస్సాద్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. డమాస్కస్ నుంచి బయలుదేరిన క్రమంలో హోమ్స్ నగరంపై విమానం మిస్సైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ధ్రువపరుస్తున్న ఎలాంటి ఆధారాలు ప్రస్తుతానికి వెలువడలేదు.

Exit mobile version