NTV Telugu Site icon

Monkey Pox: స్వీడన్‌లో తొలి మంకీపాక్స్ వైరస్ కేసు..

Monkey Pox.

Monkey Pox.

Monkey Pox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఉప్పెనలా నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనిని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రకటించింది. రెండేళ్లలో రెండోసారి అత్యవసర పరిస్థితిని గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇప్పటికే ఈ వ్యాప్తి ఉప్పెనలా విరుచుకుపడుతోంది. 548 మంది ఈ వైరస్ వల్ల ఆ దేశంలో మరణించారు. 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో ఇతర దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది.

Read Also: UP video: యూపీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి.. నిందితుడి కాలుకు బుల్లెట్

ఇదిలా ఉంటే, తాజాగా క్లోజ్ కాంటాక్ట్ ద్వారా స్వీడన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. స్వీడన్‌లో క్లాడ్-1 అనే అత్యంత తీవ్రమై మంకీపాక్స్ కేసు ధృవీకరించినట్లు ఆరోగ్య సామాజిక వ్యవహారాల మంత్రి జాకోబ్ ఫోర్స్‌మెడ్ వార్తా సమావేశంలో చెప్పారు.

రెండేళ్ల క్రితం యూరప్ అంతటా ఈ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 2022లో 100కు పైగా దేశాల్లో 70,000 కన్నా ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. 2022 మే నెలలో బ్రిటన్ లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు యూరప్ లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. బ్రిటన్ తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఇదిలా ఉంటే భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి.