Site icon NTV Telugu

Supreme Court: భారతీయుల తరలింపులో కేంద్రం చర్యలపై సీజేఐ ప్రశంసలు

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. అయితే రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు, కుటుంబాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మాత్రం సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని సీజేఐ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని కొనియాడారు. విద్యార్థుల తరలింపుపై ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నారన్న విషయం తనకు కూడా తెలుసన్నారు.

విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి వీలైనంత త్వరగా దేశానికి తీసుకొచ్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం విచారించింది. ఇప్పటివరకు 17వేల మంది భారతీయులను తరలించినట్లు అటార్నీ జనరల్ వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణపై సీజేఐ ఎన్వీ రమణ సంతృప్తి వ్యక్తం చేశారు. పాత తప్పుల నుంచి మనం ఇంకా ఏమీ నేర్చుకోలేకపోవడం విచారకరమరి.. ఇప్పటికీ యుద్ధాన్నే నమ్ముకుంటున్నామని.. దాని గురించి తాము ఎక్కువగా మాట్లాడం కానీ.. ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన విద్యార్థుల గురించి తమకు కూడా బాధగానే ఉందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

https://ntvtelugu.com/second-peace-meeting-between-russia-and-ukraine-ended/
Exit mobile version