Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గత వారం రోజుల్లోనే రెండోసారి బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
శనివారం రాత్రి నుంచే కూలడం ప్రారంభం
రెడ్ సీ రాష్ట్రంలోని మారుమూల ఓనీ ప్రాంతంలో ఉన్న బంగారు గని శనివారం రాత్రి నుంచే కూలడం ప్రారంభించినట్లు అబ్దుల్హయ్ ఖరీప్ అబాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సూడాన్ మినరల్ రిసోర్సెస్ కంపెనీకి చెందిన ఓ అధికారి పేరు వెల్లడించకుండా వివరాలు వెల్లడించారు. ఆదివారం నాటికి 11 మృతదేహాలను వెలికితీశామని, 30 మందిని సురక్షితంగా రక్షించామని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడంపై సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసి సంతాపం వ్యక్తం చేసింది.
వారం రోజుల్లోనే రెండో గని ప్రమాదం
సూడాన్‌లో కేవలం వారం వ్యవధిలోనే బంగారు గని కూలిన ఘటన ఇది రెండోది. గత ఆదివారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో పలు గనులు వరుసగా కూలిపోయాయి. ఆ ప్రమాదంలో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) ఆధీనంలో ఉంది. గత మూడేళ్లకు పైగా RSF, సూడాన్ సైన్యంతో యుద్ధం చేస్తోంది.
భద్రతా ప్రమాణాలపై ఆందోళన
సూడాన్‌లో పెద్ద ఎత్తున బంగారం ఉత్పత్తి జరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా వేలాది చిన్న, అనధికారిక గనులు ఉన్నాయి. వీటిలో భద్రతా ప్రమాణాలను సక్రమంగా పాటించకపోవడం వల్ల తరచూ ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు, స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
మూడేళ్లుగా యుద్ధంతో సూడాన్ విలవిల
2023 ఏప్రిల్‌లో సూడాన్ సైన్యం, RSF మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మానిటరింగ్ గ్రూప్ ప్రకారం, ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 59,000 మంది మరణించారు. అయితే వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని సహాయక సంస్థలు అంచనా వేస్తున్నాయి. సూడాన్ నుంచి పెద్ద ఎత్తున బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నిపుణులు గతంలో పేర్కొన్నారు. ఈ అక్రమ బంగారం వ్యాపారం ద్వారా RSF తమ యుద్ధ కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకుంటోందని వారు ఆరోపించారు.

