Sri Lankan children suffering from hunger: శ్రీలంక దేశ ఆర్థిక కష్టాలు ఇప్పటికిప్పుడే తీరేలా లేవు. గత మార్చి నుంచి శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగాయి. పెట్రోల్, డిజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. పనులు లేక మహిళలు వ్యభిచారులుగా మారుతున్న దయనీయ పరిస్థితులు శ్రీలంకలో చూస్తున్నాం. శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోయాయి. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలను తెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమను ఆదుకోవాలని ఐఎంఎఫ్ ను కోరుతోంది శ్రీలంక.
ఇదిలా ఉంటే శ్రీలంకలో పిల్లల పరిస్థితి దారుణంగా మారుతోంది. అర్థాకలితో శ్రీలంకలో పిల్లలు అలమటిస్తున్నారు. ఆకలితోనే పడుకోవాల్సి వస్తోందని యూనిసెఫ్ దక్షిణాసియా డైరెక్టర్ జార్జ్ లారీయా అడ్జీ అన్నారు. శ్రీలంకలో పిల్లలు ఆకలితోనే పడుకుంటున్నారని.. తరువాత ఎప్పుడు తింటామో తెలియని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. దక్షిణాసియా అంతటా కూడా తీవ్రమైన ఆర్థిక అనిశ్చితి ఉందని.. ఇది ఆయా దేశాలకు హెచ్చరిక అని ఆయన అన్నారు. దక్షిణాసియా దేశాలు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చని యూనిసెఫ్ హెచ్చరించింది. నిత్యావసరాల ధరలు పెరగడం, తగినంత ఆహార ధాన్యాల ఉత్పత్తి లేకపోవడం, ప్రజల ఆదాయం తగ్గడంతో అక్కడి ప్రజలకు తిండికి తిప్పలు అవుతోంది.
Read Also: Nagaland: నాగాలాండ్ రాష్ట్రంలో వందేళ్ల తరువాత రెండో రైల్వే స్టేషన్
శ్రీలంకలోని పిల్లల నిత్యావసరాలను తీర్చేందుకు యూనిసెఫ్ 25 మిలియన్ డాలర్లను కోరింది. పిల్లల్లో వేగవంతంగా వ్యాప్తి చెందుతున్న పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి అక్కడి ప్రభుత్వం కూడా చర్యలు మొదలుపెట్టింది. 2021లో అధికార లెక్కల ప్రకారం శ్రీలంక వ్యాప్తంగా 5,70,000 మంది ప్రీ-స్కూల్ విద్యార్థులలో 1,27,000 మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఏప్రిల్ నెలలో శ్రీలంక 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేని పరిస్థితికి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ కోసం చర్చలు జరుపుతోంది.
