శ్రీలంకలో నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపైనా, హాని కలిగించే వారిపైనా కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్ట్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఎమర్జెన్సీ గుప్పిట్లో కొనసాగుతున్న శ్రీలంకలో సైన్యానికి, పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడడం పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో మండిపడుతున్న ప్రజలు… ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లను దగ్ధం చేశారు. ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగాక హింస మరింత పెరిగింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించగా, 220 మందికి పైగా గాయపడ్డారు.
కాగా, శ్రీలంకలో పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. దేశమంతా అల్లర్లతో అట్టుడుకుతోంది. పాలక వర్గాలకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలకు ఆందోళనాకారులు నిప్పు పెడుతున్నారు. ప్రభుత్వ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గొడవల్లో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతున్నవారు కూడా అధికంగా వున్నారు. ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు. కర్ఫ్యూ విధించినా కంట్రోల్ కావడం లేదు. దీంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కీలక నిర్ణయం తీసుకున్నారు.
అల్లర్లను అదుపులోకి తీసుకునేందుకు, మిలటరీ, పోలీసులకు ఎమర్జెన్సీ ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పవర్స్ తో బలగాలు ఎలాంటి వారెంట్లు లేకుండానే నిరసనకారులను అదుపులోకి తీసుకోచ్చు. 24 గంటల పాటు అనుమానితులను తమ అదుపులో వుంచుకుని, తర్వాత పోలీసులకు అప్పగించే అధికారం ఆర్మీకి ఇచ్చారు. ఫోర్స్ కు స్పెషల్ పవర్ ఇవ్వడం వల్ల పౌర యుద్ధం మరింత పెరుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. మాజీ ప్రధాని మహింద రాజపక్సే, తన ఫ్యామిలీతో కలిసి రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నారు. ట్రిన్ కోమలిలోని నేవల్ బేస్ లోకి వెళ్లారు. కుమారుడు నమల్ కూడా కోలంబోను వీడాడు. మరోవైపు శ్రీలంక హింసను ఖండించిన ఐక్యరాజ్య సమితి, వీటిపై సమగ్ర, పారదర్శక విచారణ జరగాలంటోంది. లంకలో ప్రజాస్వామ్యం, సుస్థితర నెలకొనాలని భారత్ ఓ ప్రకటనలో తెలిపింది.
