శ్రీలంకలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో గత కొన్ని నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గురువారం శ్రీలంకలో మరోసారి టెన్షన్ నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థి సంఘాలు రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. గోటబయ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీగా వచ్చిన విద్యార్థులను, ప్రజలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానెన్లతో విద్యార్థులను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో చాలా మంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొంది. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న రాజపక్స కుటుంబీకుల అవినీతి వల్లే శ్రీలంకలో పరిస్థితులు ఇలా ఏర్పడ్డాయని శ్రీలంక ప్రజలు ఆరోపిస్తున్నారు. చైనా నుంచి భారీగా అప్పులు చేయడంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స వెంటనే గద్దె దిగిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజల ఆందోళనలతో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. భద్రత కారణాల వల్ల ఆయన్ను శ్రీలంక ఆర్మీ సేఫ్ ప్లేస్ కు తరలించింది.
మరోవైపు కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించాడు అధ్యక్షుడు గోటబయ రాజపక్స. కానీ ప్రజలు మాత్రం గోటబయ తన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ లేని పరిస్థితి ఉంది. పెట్రోల్ కొనుగోలు చేద్ధాం అన్నా… శ్రీలంక ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవని ప్రభుత్వమే చెబుతోంది. దీంతో గంటల తరబడి పెట్రోల్ బంకుల్లో క్యూల వద్ద ఎదురుచూస్తున్నారు ప్రజలు.
