NTV Telugu Site icon

Sri Lanka Crisis: పెట్రోల్ కొనడానికి కూడా డబ్బులు లేవు

Srilanka

Srilanka

శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ ప్రజలకు నిత్యావసరాలు అందించలేని పరిస్థితుల్లో ఉంది. మరోవైపు శ్రీలంకలో ఇంధన సంక్షోభం ముదురుతోంది. దేశ వ్యాప్తంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ఇంధన శాఖ, విద్యుత్ మంత్రి కాంచన విజేశేఖర కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ కు విదేశీ మారక నిల్వలు చెల్లించే పరిస్థితి కూడా లేదని విజేశేఖర వెల్లడించారు. తమ జలాల్లో రెండు నెలల పాటు లంగర్ వేసి ఉన్న పెట్రోల్ ఓడలకు డబ్బు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉంది. ఇదిలా ఉంటే దేశంలో తగినంత డిజిల్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల రెండు రోజుల క్రితం దేశంలో ఒక రోజుకు సరిపడే పెట్రోల్ నిల్వలు ఉన్నాయని ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రజలకు తెలిపారు. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో నిల్వలు అయిపోయాయి. ప్రస్తుతం ప్రజలు ఎవ్వరూ పెట్రోల్ బంకులు ముందు నిలబడవద్దని ప్రభుత్వం సూచించింది.

పరిమితమైన పెట్రోల్ నిల్వలు మాత్రమే ఉన్నాయని.. ముఖ్యంగా అంబులెన్స్, అత్యవసర సేవలకు మాత్రమే పెట్రోల్ పంపిణీ చేసేలా ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 2022 నాటికి ఇంధన దిగుమతుల కోసం శ్రీలంకకు 530 మిలియన్ల యూఎస్ డాలర్లు అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం భారత్ క్రెడిట్ లైన్ ద్వారా పొందుతున్నప్పటికీ అవి దేశ అవసరాలకు చాలడం లేదు.

ఇదిలా ఉంటే కొత్త ప్రధాని కొలువు తీరినా… ఇప్పటికిప్పుడు శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు నుంచి 160 మిలియన్ డాలర్లు శ్రీలంకకు అందాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి గ్రాంట్ వస్తుందని శ్రీలంక భావిస్తోంది. మరోవైపు శ్రీలంకలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు గోటబయ కూడా తన పదవి నుంచి దిగిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నిరసనలతో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల శ్రీలంక పార్లమెంట్ లో అధ్యక్షుడు గోటబయపై పెట్టిన అవిశ్వాస తీర్మాణం వీగిపోయింది.