NTV Telugu Site icon

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకం… పరిస్థితిని గమనిస్తున్న అమెరికా

Sri Lanka

Sri Lanka

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. ఓ వైపు గోటబయ సర్కార్ ఎమర్జెన్సీ విధించినా… ఆందోళనలు తగ్గడం లేదు. దాదాపుగా గత రెండు నెలల నుంచి శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరతతో శ్రీలంక అల్లాడుతోంది.

ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా తరువాత శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీలంక హంబన్ టోటాలోని రాజపక్సేల పూర్వీకులు ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో పాటు కాండీలోని మాజీ మంత్రి మిన్ కెహెలియా రాంబుక్వెల్లా ఇంటికి కూడా కాల్చేశారు. ఎంపీలు బందుల గుణవర్దన, ప్రసన్న రణతుంగ, చన్నా జయసుమన, కోకిల గుణవర్దన, అరుండికా ఫెర్నాండో, థిస్సా కుట్టియారాచ్చి, కనక హెరాత్, పవిత్ర వన్నీయారాచ్చి ఇళ్లపై కూడా దాడి జరిగింది. శ్రీలంకలో ఆందోళనల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలను ఆర్మీ రహస్య ప్రదేశాలకు తరలిస్తోంది. దీంతో పాటు మాజీ ప్రధాని మహిందా రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్సేలను వేరే దేశానికి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సమస్యల పరిష్కారానికి ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మరోసారి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కోరాడు. దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఉన్న రాజపక్సే కుటుంబ సభ్యులు గద్దె దిగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా చేయగా… అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కూడా తన పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంది. శ్రీలంకలో చెలరేగుతున్న హింసపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక, రాజకీయ సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాలని యూఎస్ డిపార్ట్మెంట్ శ్రీలంక ప్రజలను  కోరింది.