Site icon NTV Telugu

గుడ్ న్యూస్… స్పుత్నిక్ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కు చెక్

దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో 91 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 100కి పైగా కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి. అయితే కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా ఒమిక్రాన్ సోకుతుందన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read Also: మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా వదలని ఒమిక్రాన్‌

ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌పై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. స్పుత్నిక్ లైట్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్‌ను అణిచివేయవచ్చని వివరించింది. ఇతర వ్యాక్సిన్‌ల కంటే మూడు నుంచి ఏడు రెట్లు ఉత్తమంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పనిచేస్తుందని రష్యా ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఒకవేళ ఒమిక్రాన్ సోకినా తీవ్ర వ్యాధి బారిన పడకుండా ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తోందని తెలిపింది. స్పుత్నిక్ లైట్‌తో పోల్చితే ఫైజర్‌ టీకా 25 శాతం మాత్రమే ప్రభావాన్ని చూపెట్టిందని పేర్కొంది. కాగా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ రూపొందించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇప్పటికే చాలా దేశాల్లో వినియోగంలో ఉంది.

Exit mobile version