Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 46 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం ఉదయం రాజధాని మాడ్రిడ్ సమీపంలోని టోలెడో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో మాడ్రిడ్ నుంచి సియుడాల్ రియల్, అండలూసియా ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపేశారు.
స్పెయిన్ రైల్వే వ్యవస్థ నిర్వహణ సంస్థ ఏడీఐఎఫ్ (ADIF) తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగింది. మాడ్రిడ్-అండలూసియా హైస్పీడ్ రైల్వే మార్గంలో రెండు రైళ్లు ఢీకొనడంతో రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపేసినట్లు సంస్థ ప్రకటించింది. రెన్ఫె ఏవీ రైలు, అప్పటికే ట్రాక్‌పై నిలిచి ఉన్న ఇరియో రైలును వెనక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న వేగానికి రైలు బోగీలు పట్టాలపై చెల్లచెదురుగా పడిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్య్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన ప్రయాణికుల్ని వైద్య సహాయం కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాద సమయంలో రెన్ఫే రైలులో 397 మంది ప్రయాణికులు ఉండగా, ఇరియో రైలులో 147 మంది ప్రయాణిస్తున్నారు. దీంతో రెండు రైళ్లలో కలిసి మొత్తం 544 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

