Hate Crime: అగ్రరాజ్యం అమెరికాలో విద్వేషపూరిత దాడులు కొనాసాగుతున్నాయి. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. తాజాగా ఓ సిక్కు యువకుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తలపాగా ధరించిన 19 ఏళ్ల సిక్కు యువకుడిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం బాధిత యువకుడు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వచ్చి..‘‘మేము ఈ దేశంలో అలా ధరించము. ఆ ముసుగును తీసేయ్’’అని చెప్పాడు. నిందితుడు సిక్కు యువకుడి ముఖం, వీపుపై కొట్టడమే కాకుండా బస్సు దిగి కాలినడకన బయలుదేరే ముందు యువకుడి తలపాగాను తీసేందుకు ప్రయ్నతించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also: Sehar Shinwari: బంగ్లా ఆటగాళ్లకు పాక్ నటి బంపర్ ఆఫర్.. భారత్ను ఓడిస్తే!
న్యూయార్క్ లో ఉన్న సిక్కు సంస్థ ‘నేషనల్ సిక్ ఫెయిత్ ఆర్గనైజేషన్’ ఈ దాడిపై ఆందోళన వ్యక్తం చేసింది. బాధిత యువకుడితో మాట్లాడామని, సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ‘‘ న్యూయార్క్ బస్సులో ఒక సిక్కు యువకుడిపై జరిగిన విద్వేషపూరిత దాడి గురించి సిక్కు సంస్థకు తెలిసిందని, ఈ దాడిపై తీవ్రంగా కలత చెందామని, సమాచారం ప్రకారం నిందితుడు తలపాగాను చింపేయడానికి ప్రయత్నించాడని, యువకుడిని పదేపదే కొట్టాడని, బాధిత యువకుడికి సాయం అందించేందుకు అతనితో కలిసి పనిచేస్తున్నాము’’అని ట్వీట్ ద్వారా తెలియజేశారు.
సిక్కు కమ్యూనిటీ కార్యకర్త జప్నీత్ సింగ్ మాట్లాడుతూ.. బాధితయువకుడి తీవ్ర బాధలో ఉన్నాడని, అతని కుటుంబం భయపడిందని తెలిపారు. ఈ ఘటన గురించి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ హేట్ క్రైమ్ యూనిట్ ద్వారా విచారణ చేపట్టింది. న్యూయార్క్ పోలీసులు నిందితుడి నిఘా చిత్రాలను విడుదల చేసింది. అనుమానితుడు 25-32 ఏళ్ల వయసు కలిగిన డార్క్ కలర్ కలిగిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రజల సాయాన్ని కోరారు.