జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఓ దుండగుడు కాల్చి చంపాడు. అయితే తాజాగా సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో షింజో అబే పార్టీ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) విజయం సాధించింది. జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకు గానూ 148 స్థానాలు సాధించింది. షింజో అబే మరణం తరువాత సానుభూతి పవనాల వీయడంతో ఆయన పార్టీ భారీ విజయం సాధించింది. మెజారిటీకి కావాల్సిన దాని కన్నా మరో 22 సీట్లు అధికంగా వచ్చాయి. ఈ విజయంతో ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా 2025 వరకు జపాన్ ను పాలించే అవకాశం ఏర్పడింది.
Read Also: Hyderabad: సీఐ నాగేశ్వరరావు కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
ఈ ఫలితాలపై జపాన్ ప్రధాని కిషిడ స్పందించారు. షింజో అబే లేకుండా పార్టీని నడపడం కష్టతరమని ఆయన అన్నారు. కోవిడ్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ధరల కట్టడికి తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. జపాన్ కు ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన షింజో అబే.. నారా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో యమగామి టెట్సుయా అనే దుండగుడు రెండు రౌండ్లు షింజో అబేపైకి కాల్పులు జరిపాడు. దీంతో గుండెలో గాయం కావడం వల్ల షింజో అబే మరణించాడు. వైద్యులు అతన్ని బతికించేందుకు దాదాపుగా 5 గంటలు కష్టపడిన ఫలితం లేకపోయింది.
షింజో అబే మరణంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత్ తో పాటు అమెరికా ఇతర మిత్ర దేశాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఆయన మరణానికి నివాళిగా ఇండియా ఒక రోజు జాతీయ సంతాప దినాన్ని పాటించింది. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో చైనాకు కొరకరాని కొయ్యగా మారిన షింజో అబే మరణంపై చైనా సంబరాలు చేసుకుంది. ఏకంగా రెస్టారెంట్లు డిస్కౌంట్లు ప్రకటించాయి. చైనా సోషల్ మీడియా విబోలో ఒకరిఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
