శుక్రవారం పశ్చిమ జపాన్ నగరమైన నారాలో ప్రచార ప్రసంగం సందర్భంగా హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే భౌతిక కాయాన్ని టోక్యోలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. నారా నుంచి భౌతిక కాయం వెంట ఆయన సతీమణి అకీ అబే వచ్చారు. అబే నివాసంలో నేతలు, ప్రజలు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించనున్నారు. మాజీ ప్రధాని షింజో అబే ఇంటికి ప్రధాని ఫుమియో కిషిడా కూడా వచ్చారు. సోమవారం రాత్రి జాగరణ నిర్వహించి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
మరోవైపు, అబేను హత్య చేసిన టెట్సుయా యమగామిని విచారిస్తున్న పోలీసులు పలు విషయాలు రాబట్టారు. అబేకు ముందు ఓ మత సంస్థ నాయకుడిని హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు హంతకుడు పోలీసులకు వివరించినట్లు జపాన్ మీడియా తెలిపింది. అబేతో సంబంధం ఉన్న ఆ మత సంస్థపై యమగామికి ద్వేషం ఉన్నట్లు వివరించింది. అబే రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్నందున నేరం చేసినట్లు తాను అంగీకరించలేనని అతను తెలిపినట్లు జపాన్ పోలీసులు వెల్లడించారు.
Shinzo Abe: షింజో అబేను అందుకే కాల్చేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు
అంతర్జాతీయ నాయకులు అబే కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. హత్యపై విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. హత్యపై దర్యాప్తు కొనసాగుతుండగా, అబేను కాల్చి చంపిన తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తి జపాన్ నేవీలో మూడేళ్లపాటు పనిచేసినట్లు స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. శుక్రవారం పశ్చిమ జపాన్లోని నారా నగరంలో ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో అబేపై కాల్పులు జరిగాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. “కార్డియోపల్మోనరీ అరెస్ట్” పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అబే ప్రాణాలు విడిచినట్లు సాయంత్రం 5:03 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) వైద్యులు అధికారికంగా వెల్లడించారు. స్థానిక మీడియా ప్రకారం, నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే అనుమానితుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అతను 2006-07, 2012-20 వరకు రెండుసార్లు జపాన్ ప్రధానిగా ఉన్నారు. అతని తరువాత యోషిహిడే సుగా, ఫ్యూమియో కిషిడా అధికారంలోకి వచ్చారు