సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావీ అల్ సౌద్ (29) మృతిచెందాడు. లండన్‌లోని ఓ హోటల్‌లో మద్యం, మాదకద్రవ్యాల మిశ్రమం సేవించడంతో సౌదీ యువరాజు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందని యూకే విచారణలో నిర్ధారైంది. మద్యం, డ్రగ్స్, మందుల మోతాదు అధికంగా సేవించడం వల్లే ఈ మరణానికి కారణమని యూకే కోర్టు తేల్చింది. మద్యం, ఆందోళన తగ్గించే ప్రిస్క్రిప్షన్ మందులను కలిపి తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు తేల్చింది. ఇది ఆత్మహత్య కాదని.. అనుకోకుండా జరిగిన ప్రమాదవశాత్తు మరణం అని కోర్టు పేర్కొంది.
బాత్రూమ్‌లో యువరాజు
2025 నవంబర్ 25న లండన్‌లోని కెన్సింగ్టన్ మారియట్ హోటల్ గదిలో యువరాజు స్పందించకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా.. బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించారు. అత్యవసర వైద్య సిబ్బంది చికిత్స అందించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇన్నర్ వెస్ట్ లండన్ కరోనర్ కోర్టులో జరిగిన విచారణలో టాక్సికాలజీ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. రక్తంలో 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. ఇది ఇంగ్లాండ్‌లో అనుమతించే డ్రంక్ డ్రైవింగ్ పరిమితి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అదనంగా ప్రమాదకర స్థాయిలో GHB అనే పార్టీ డ్రగ్, కేనబిస్, జానాక్స్ (Alprazolam)తో పాటు ఇతర ఆందోళన నివారణ మందుల ఆనవాళ్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి దీర్ఘకాలిక లేదా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని వెల్లడైంది. ఈ మాదక పదార్థాలు, మద్యం, మందుల కలయిక వల్లే గుండెపోటు వచ్చి మరణించినట్లు వైద్య నిపుణులు కోర్టుకు వివరించారు.
సీసీటీవీలో కీలక ఆధారాలు
యువరాజు నవంబర్ 19న వారంరోజుల బస కోసం హోటల్‌లో చెక్-ఇన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. మరణానికి ముందు రోజు రాత్రి సిగరెట్ తాగేందుకు కొద్దిసేపు బయటకు వెళ్లి తిరిగి ఒంటరిగా గదికి వచ్చినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. గదిలోకి మరెవరూ ప్రవేశించిన ఆనవాళ్లు లేవని, మూడో వ్యక్తి ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణలో యువరాజు గతంలో మద్యం అలవాటు, ప్రిస్క్రిప్షన్ మందులపై ఆధారపడే సమస్యతో చికిత్స పొందినట్లు వెల్లడైంది. 2025 ఆగస్టులో రోహాంప్టన్‌లోని ప్రైయరీ క్లినిక్లో డీటాక్స్ చికిత్స తీసుకున్న అనంతరం మెర్సీసైడ్‌లోని రైన్‌ఫోర్డ్ హాల్ క్లినిక్‌లో మరింత చికిత్స పొందారు. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విక్టోరియా చమోరో కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. యువరాజు చికిత్సకు మంచి స్పందన చూపారని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ సమయంలో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఫాలోఅప్ అపాయింట్‌మెంట్‌లకు మాత్రం హాజరుకాలేదని చెప్పారు.
విచారణలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, యువరాజు ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తం చేయలేదని, హత్య లేదా ఇతరుల ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్ తెలిపారు. యువరాజు మరణానంతరం సౌదీ రాయల్ కోర్టు ఆయన విదేశంలో మరణించినట్లు అధికారికంగా ప్రకటించింది. అనంతరం రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించారు.

