గత కొద్దిరోజులుగా సౌదీపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. ఆ మధ్య మక్కాపై కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ.. అమెరికా సాయం కోరితే అందుకు నిరాకరించింది. ఇక మక్కా ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ వస్తుందనుకుంటే రాకుండా హ్యాండ్ ఇచ్చింది. దీంతో సౌదీ చేసేదేమీలేక రాజీ మార్గానికి వచ్చింది. హౌతీలతో రెండు వారాల కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేయాలని సౌదీ అరేబియా.. ఒమాన్‌ను కోరినట్లు లెబనాన్‌కు చెందిన అల్ అఖ్‌బార్ వార్తాపత్రికను ఉటంకిస్తూ నివేదికలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజీ మార్గమే పరిష్కారంగా సౌదీ భావిస్తోంది.
హౌతీలపై సైనిక చర్యకు అమెరికా నుంచి ప్రత్యక్ష మద్దతు లభించే పరిస్థితి కనిపించకపోవడంతో సౌదీ ఈ దౌత్య మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే సౌదీ ప్రభుత్వం ఇప్పటివరకు హౌతీలపై భారీ స్థాయిలో సైనిక దాడులకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తన చమురు మౌలిక సదుపాయాలపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉండటంతో పాటు.. యెమెన్‌లో మళ్లీ పూర్తిస్థాయి అంతర్యుద్ధంలోకి లాగబడే ప్రమాదంపై రియాద్ ఆందోళన చెందుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
అల్ అఖ్‌బార్ నివేదిక ప్రకారం.. ఒమాన్ ద్వారా హౌతీలకు సౌదీ అరేబియా కొత్త ప్రతిపాదనను పంపినట్లు సమాచారం. ఇందులో రెండు వారాల కాల్పుల విరమణ, అనంతరం సౌదీ, హౌతీ నాయకత్వాల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభించాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి రోజుల్లో అమెరికా, ఈజిప్ట్, పాకిస్థాన్, ఒమాన్‌తో సౌదీ నిర్వహించిన వరుస సంప్రదింపుల అనంతరం ఈ ప్రతిపాదన రూపొందించినట్లు నివేదిక పేర్కొంది. తొలుత హౌతీల మానవతా సంబంధిత డిమాండ్లపై చర్చించి.. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపు సమగ్ర ఒప్పందానికి రావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
హౌతీల దూకుడు
సౌదీ అరేబియా, హౌతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. గురువారం ఇరువర్గాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా దాడులు నిర్వహించినట్లు నివేదికలు తెలిపాయి. హౌతీలు బాబ్-ఎల్-మందెబ్ జలసంధి వైపు ముందుకు సాగుతున్నారని, పలు వ్యూహాత్మక దీవులను తమ ఆధీనంలోకి తీసుకున్నారని సమాచారం. అదే రోజు జరిగిన మరో దాడిలో సౌదీ అరేబియాలోని తూర్పు-పశ్చిమ చమురు పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీ.. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో బాబ్-ఎల్-మందెబ్ మార్గంపై మరింత ఆధారపడుతున్నట్లు సమాచారం. దీంతో యెమెన్, సౌదీ అరేబియాకు యుద్ధం విస్తరించడం వల్ల గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులకు మరో కీలక సముద్ర మార్గం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ సాయం నిరాకరించారా?
హౌతీలను ఎదుర్కొనే విషయంలో సౌదీ ఒంటరిగా మిగిలిన పరిస్థితుల్లో.. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వరుసగా కీలక నేతలతో సమావేశమవుతున్నారు. కైరోలో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసీతో మొహమ్మద్ బిన్ సల్మాన్ సమావేశమయ్యారు. ఎర్ర సముద్రం, బాబ్-ఎల్-మందెబ్ జలసంధిలో నౌకా రాకపోకల స్వేచ్ఛ, భద్రతను కాపాడటంపై ఇరువురు నేతలు తమ నిబద్ధతను పంచుకున్నట్లు సమాచారం. అయితే ఈజిప్ట్ సౌదీకి ప్రత్యక్ష సైనిక సాయం చేసే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. అరబ్ ప్రపంచంలో తన ప్రభావంతో మద్దతు కూడగట్టడంలో సహాయపడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా.. మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తోనూ సమావేశమైనట్లు సమాచారం. హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ కోరిన సైనిక సహాయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన కొన్ని రోజుల తర్వాత ఈ భేటీ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో అమెరికా రెండు నెలల పాటు హౌతీలపై బాంబు దాడులు నిర్వహించిన అనంతరం.. అమెరికా, హౌతీల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. తాజాగా సౌదీపై హౌతీల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే విషయంలో అనిశ్చితి నెలకొంది.
ట్రంప్ మాత్రం మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో మాట్లాడినట్లు.. ఆయన తనకు ‘మంచి స్నేహితుడు’ అని పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ ప్రాంతంలో పరిస్థితులు సర్దుకుంటాయని చెప్పినప్పటికీ.. తాను త్వరలోనే ఒక ‘పెద్ద నిర్ణయం’ తీసుకోబోతున్నట్లు ట్రంప్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం హౌతీల దాడులు, ఎర్ర సముద్రం-బాబ్-ఎల్-మందెబ్‌లో నౌకాయాన భద్రత, సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై ముప్పు వంటి అంశాల మధ్య.. రియాద్ దౌత్యపరమైన పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ నివేదికలు సూచిస్తున్నాయి.

