కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. దీంతో చమురు సరఫరాకు అన్ని రకాల దారులు సౌదీకి నిలిచిపోయాయి. దీంతో సౌదీ తీవ్ర ఇరాకటంలో పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చమురు ఎగుమతుల మార్గాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఐరోపాకు చమురు సరఫరా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ఎర్ర సముద్రంలోని యన్బు (Yanbu) చమురు ఎగుమతి టెర్మినల్‌లో అంతరాయాలు ఏర్పడటంతో.. సౌదీ అరేబియా తన గల్ఫ్ పోర్టు రాస్ తనూరా (Ras Tanura) నుంచి సుమారు 6 కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను ఒమాన్‌లోని సోహార్ (Sohar) పోర్టు మీదుగా మళ్లిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది.
వాణిజ్య రంగానికి చెందిన పలువురు వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ నెలతో పాటు వచ్చే నెలలోనూ సౌదీ చమురును సోహార్‌కు తరలించి, అక్కడ నౌకల మధ్య నేరుగా చమురు బదిలీ (Ship-to-Ship Transfer) ద్వారా ఎగుమతులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో.. సౌదీ చమురు ఉత్పత్తి ప్రాంతాన్ని ఎర్ర సముద్రంతో కలిపే పైప్‌లైన్‌పై జరిగిన దాడి తర్వాత యన్బు టెర్మినల్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వచ్చే నెల తమకు సౌదీ క్రూడ్ సరఫరా ఉండదని కనీసం ఇద్దరు యూరోపియన్ రిఫైనరీ కస్టమర్లకు Saudi Aramco సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
యన్బు దగ్గర ఎగుమతులు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై సౌదీ అరేబియా దృష్టి పెట్టింది. సాధారణంగా సౌదీ చమురును గల్ఫ్, ఎర్ర సముద్రంలోని ఎగుమతి కేంద్రాలకు తరలించేందుకు తన మౌలిక సదుపాయాలను వినియోగిస్తుంది. అయితే పైప్‌లైన్‌పై దాడి తర్వాత యన్బు నుంచి ఎగుమతులు మందగించడంతో.. గల్ఫ్ ప్రాంతంలోని రాస్ తనూరా నుంచి ఒమాన్‌లోని సోహార్‌కు చమురును తరలిస్తున్నట్లు వాణిజ్య వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. సోహార్ దగ్గర నౌకల మధ్య చమురు బదిలీ చేసి అంతర్జాతీయ కొనుగోలుదారులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ విధానం ద్వారా సౌదీ అరేబియా సాధారణ ఎగుమతి మార్గాల్లో ఎదురవుతున్న కొన్ని సమస్యలను అధిగమిస్తూ అంతర్జాతీయ మార్కెట్లకు చమురును చేరవేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
యూరప్‌కు మాత్రం షాక్
ఒమాన్ మీదుగా తరలిస్తున్న స్పాట్ కార్గోలకు చైనా, దక్షిణ కొరియాకు చెందిన రిఫైనరీలు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నట్లు సమాచారం. కొంత సరఫరా భారత్, జపాన్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు తెలిపాయి. అయితే యూరోపియన్ రిఫైనరీలకు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వచ్చే నెల సౌదీ నుంచి ఎలాంటి క్రూడ్ సరఫరా అందదని యూరప్‌లోని కస్టమర్లకు Saudi Aramco తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. సాధారణంగా సౌదీ అరేబియా యూరోపియన్ రిఫైనరీలకు దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా ప్రతి నెలా నిర్ణీత పరిమాణంలో క్రూడ్‌ను సరఫరా చేస్తుంది. అయితే వచ్చే నెల ఆ సరఫరాలు నిలిచిపోనున్నట్లు సమాచారం.
సరఫరా నిలిపివేతకు ముందు యూరోపియన్ దేశాలు సౌదీ అరేబియా నుంచి రోజుకు సుమారు 5.77 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో వచ్చే నెల సరఫరా నిలిపివేత ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు సౌదీ గల్ఫ్ పోర్టుల నుంచి ఒమాన్ మీదుగా భారీ పరిమాణంలో చమురును తరలిస్తున్నప్పటికీ.. ఆ చమురు సౌదీ సంప్రదాయ మార్కెట్లన్నింటికీ సమానంగా చేరడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పాట్ కార్గోల్లో ఆసియా రిఫైనరీలు ప్రధాన కొనుగోలుదారులుగా మారుతున్నాయి.
ధరలపై ప్రభావం?
సౌదీ ఎగుమతుల్లో చోటుచేసుకున్న ఈ మార్పు ప్రపంచ చమురు మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోంది. గల్ఫ్ ప్రాంతం నుంచి అదనపు క్రూడ్ సరఫరా కొంతమేర పుంజుకోవడంతో.. యన్బు నుంచి తగ్గిన సరఫరాను ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భర్తీ చేయగలమా అన్నదానిపై మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే.. పైప్‌లైన్‌పై దాడి కారణంగా సౌదీ చమురు ఉత్పత్తి పూర్తిగా మార్కెట్ నుంచి మాయమైన పరిస్థితి కాకుండా.. ఎగుమతి మార్గాలు, కొనుగోలుదారుల మధ్య సరఫరాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. యన్బు ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో గల్ఫ్ నుంచి ప్రత్యామ్నాయంగా చమురు తరలిస్తుండగా.. మరోవైపు యూరోపియన్ కొనుగోలుదారులు వచ్చే నెల తమ సాధారణ సౌదీ క్రూడ్ సరఫరాను కోల్పోనున్నారు.

