Putin reacts to PM Modi’s ‘peaceful dialogue’ appeal in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని విడనాడి శాంతియుత చర్చలకు వెళ్లాలని భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. అయితే ఈ నరేంద్రమోదీ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ తో శాంతియుత చర్చలకు భారత్, చైనాలు మద్దతు ఇచ్చాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం అన్నారు. గత నెలలో ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో యుద్ధంపై మోదీ, జిన్ పింగ్ ఇద్దరూ పుతిన్ తో విభేదించారు.
తాజాగా కజక్ రాజధాని ఆస్తానాలో మాట్లాడుతూ.. భారత్, చైనా చర్చలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతిదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడాయి… ఈ రెండు దేశాలు మాకు సన్నిహిత మిత్రులు, భాగస్వాములు అని వారి స్థానాన్ని మేము గౌరవిస్తున్నామని పుతిన్ అన్నారు. అయితే ఉక్రెయిన్ చర్చలు కావాలని చెబుతూనే ఉంది.. వారు చర్చలు కావాలని కోరుకున్నట్లే కనిపిస్తుందని.. అయితే చర్చలను నిషేధిస్తూ అధికారిక నిర్ణయం తీసుకుందని పుతిన్ అన్నారు.
గత సెప్టెంబర్ నెలలో సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో.. ప్రధాని మోదీ ‘‘ ఇది యుద్ధాల యుగం కాదు’’ అని పుతిన్ తో వ్యాఖ్యానించారు. ఈ సమస్యను త్వరలోనే ముగించాలని పుతిన్ ను కోరారు. చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతియుత చర్చలకు చైనా అన్ని ప్రయత్నాలు చేస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి యూఎన్ఓలో చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో చర్చలు జరపాల్సిన అవసరం మాకు లేదని పుతిన్ అన్నారు. ఇండోనేషియా వేదికగా జరిగే జీ-20 సమ్మిట్ లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై భారీ దాడులు అవసరం లేదని తెలిపారు పుతిన్. గత వారం పుతిన్ ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని, తూర్పు ప్రాంతంలో ఉన్న ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో అధికారికంగా విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
