NTV Telugu Site icon

Russia: ఆఫ్రికా దేశాల శాంతి ప్రతిపాదనలు.. పరిశీలిస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Russia

Russia

Russia: ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమించి శాంతి స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ఆఫ్రికా దేశాలు రష్యాను కోరుతున్నాయి. ఈ మేరకు ఆఫ్రికన్‌ దేశాల ప్రతినిధులు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసి విజ్ఞప్తి చేశాయి. అయితే యుద్ధం విరమించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని.. ఉక్రెయిన్‌కు కూడా చెప్పాలని పుతిన్‌ ఆఫ్రికన్‌ దేశాలకు సూచించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు ఆఫ్రికా దేశాలు చేసిన శాంతి ప్రతిపాదనలను పరిశీలిస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హామీ ఇచ్చారు. అయితే శాంతి నెలకొనాలంటే ఉక్రెయిన్‌తో కూడా మాట్లాడాలని ఆయా దేశాలకు పుతిన్‌ సూచించారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన రష్యా-ఆఫ్రికా సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. అమెరికా సారథ్యంలోని నాటో కూటమికి పోటీగా.. ఆఫ్రికా దేశాలను మచ్చిక చేసుకోవటానికి వ్యూహాత్మకంగా పుతిన్‌ ఈ సదస్సును ఏర్పాటుచేశారు.

Read also: Bhadrachalam: గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

రష్యా- ఆఫ్రికా సదస్సుకు గతంలో 43 దేశాలు హాజరుకాగా, ఈసారి అందులో సగమే వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆఫ్రికా దేశాలూ ఇబ్బంది పడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌లోని ధాన్యంపైనే అనేక ఆఫ్రికా దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఇటీవలే ఉక్రెయిన్‌తో ధాన్యం ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. అంటే… ఉక్రెయిన్‌ నుంచి ఇకమీదట ధాన్యం బయటకు రావటం కష్టం. అది ఆఫ్రికా దేశాలకు దెబ్బ. అందుకే తాజా సదస్సులో పుతిన్‌ ఆ దేశాలకు భరోసా ఇచ్చారు. పేద ఆఫ్రికా దేశాలకు రష్యా ఉచితంగా ధాన్యం ఎగుమతి చేస్తుందని ప్రకటించారు. ‘‘ఆహార సరఫరా విషయంలో రష్యా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది. మీ ఆహార భద్రతకు ఎలాంటి ముప్పు రాకుండా మేం సహాయం చేస్తాం. భయపడాల్సిన అవసరం లేదఅని పుతిన్‌ ఆఫ్రికన్‌ దేశాలకు హామీ ఇచ్చారు. ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో ప్రిగోజిన్‌ భేటీ అయినట్టు తెలుస్తోంది. రష్యా రక్షణ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ క్రెమ్లిన్‌తో సన్నిహితంగానే మెలుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా-ఆఫ్రికా సదస్సు సందర్భంగా ఆయన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆఫ్రికా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆఫ్రికన్‌ దేశాల శాంతి ప్రతిపాదనలను రష్యా అంగీకరిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సి ఉంది?