North Korea-Russia: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కోకు మద్దతుగా నార్త్ కొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా సహజ వనరులు మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశం అయ్యారు. ఈ మేరకు అక్కడి అధికారిక వార్తా సంస్థ తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక సహకారంతో సహా అనేక అంశాలపై వీరు చర్చించుకున్నట్లు పేర్కొనింది. ఇది స్నేహపూర్వకమైన భేటీగా ఆ సంస్థ ప్రకటించింది. మరోవైపు రష్యన్ మిలటరీ అకాడమీ ప్రతినిధులు సైతం ప్యాంగ్‌యాంగ్‌లో పర్యటించినట్లు సమాచారం.
Read Also: Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా- నార్త్ కొరియా సంబంధాలు బలపడుతున్నాయి. కీవ్‌తో యుద్ధానికి సపోర్టుగా ఇప్పటికే 11వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాలో శిక్షణ పొందుతున్నారని ఉక్రెయిన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా- ఉత్తర కొరియా దేశాల మధ్య రక్షణ ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నాయి. శత్రుదేశం నుంచి దాడి జరిగితే ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు అక్కడి మీడియా చెప్పుకొచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం, కొరియా ద్వీపకల్పంలో అమెరికా మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న సైనిక భాగస్వామ్యంతో కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమీర్ పుతిన్ల మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అవుతుండటం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.