NTV Telugu Site icon

Russia: జర్నలిస్టును చంపిన హంతకుడికి పుతిన్ క్షమాభిక్ష.. మళ్లీ అదే కారణం..

Russia

Russia

Russia: ఉక్రెయిన్ యుద్ధం రష్యాలోని ఖైదీలకు వరంగా మారింది. హత్యలు, అత్యాచారాలు చేసి జైళ్లలో జీవిత ఖైదు, ఇతర శిక్షలు అనుభవిస్తు్న్న వారికి అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారనే సాకుతో అధ్యక్షుడు పుతిన్ వారికి క్షమాభిక్ష పెడుతున్నారు. తాజాగా ఓ జర్నలిస్టును హత్య చేసిన హంతకుడికి క్షమాభిక్ష పెట్టాడు.

2006లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అన్నా పొలిట్‌కోవ్‌స్కాయా హత్య కేసులో దోషిగా తేలిన రష్యా మాజీ డిటెక్టివ్ సెర్గీ ఖడ్జికుర్బనోవ్‌కి క్షమాభిక్ష ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడినందుకు ఆయనను క్షమించి వదిలేసినట్లు ఆయన న్యాయవాది మంగళవారం తెలిపారు. గత ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి వేలాది మంది ఖైదీలు యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే కొంత మంది యుద్ధం నుంచి తిరిగి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుం ఖడ్జికుర్బనోవ్ ప్రత్యేక దళాల్లో ఫైటర్‌గా పాల్గొన్నాడు, కాంట్రాక్ట్ ముగియడంతో అధ్యక్ష డిక్రీ ద్వారా అతనికి క్షమాపణ లభించిందని న్యాయవాది మిఖల్చిక్ తెలిపారు.

Read Also: Polimera 2 Director: చిరంజీవితో సినిమా.. నా వల్ల కాదు!: పొలిమేర 2 డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

48 ఏళ్ల వయసున్న పొలిట్‌కోవ్‌స్కాయాను మాస్కోలోని ఆమె అపార్ట్మెంట్ బ్లాక్ లోని లిఫ్టులో కాల్చి చంపారు. ఆమె ఇండిపెండెంట్ నోవాయా గెజిలా వార్తా పత్రికకు పనిచేసేది. ఈ హత్యలో శిక్ష అనుభవిస్తున్న వారిలో ఖడ్జికుర్బనోవ్ ఒకరు. ఆమె గతంలో చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్ అట్రాసిటీలను ఖండిస్తూ అధ్యక్షుడు పుతిన్‌ని విమర్శించింది.

ఇటీవల ఇదే విధంగా ప్రేయసిపై అత్యాచారం చేసి, 111 సార్లు కత్తితో పొడిచి, మూడు గంటల పాటు నరకం చూపించిన హంతకుడికి కూడా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్నాడనే సాకుతో అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం.. ఖైదీలు యుద్ధభూమిలో వారి నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా ఖైదీలను యుద్ధంలో పాడటాన్ని సమర్థించారు. రష్యా లక్ష మంది ఖైదీలను ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడేందుకు నియమించుకుందని స్వతంత్ర ఖైదీల హక్కుల సంఘం అధిపతి ఓల్గా రొమానోవా అంచానా వేశారు. విడుదలైన ఖైదీలు సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత హత్యలతో సహా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్లు రష్యన్ మీడియా సంస్థలు తెలిపాయి.