ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రెండో దఫా చర్చల్లో పౌరులు సురక్షితంగా తరలివెళ్లడానికి రష్యా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, తొమ్మిదో రోజు దాడుల్లో ఆ హామీకి కట్టుబడుతూనే.. ఉక్రెయిన్‌లోని భారీ పవర్ ప్లాంట్‌లను రష్యా టార్గెట్ చేసింది. యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియాలో ఉంది. దానిపై రష్యా వరుస దాడులకు పాల్పడింది. జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా బాంబు దాడి చేయడంపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ- IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రాస్సీ తీవ్రంగా స్పందించారు. ప్లాంట్ రియాక్టర్‌లు దెబ్బతింటే తీవ్ర ప్రమాదం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Ukraine Russia War: వార్ జోన్లలో 3 వేల మంది భారత విద్యార్థులు..!
ఇక, ఉక్రెయిన్‌కు దేశవ్యాప్తంగా సరఫరా అయ్యే విద్యుత్తులో ఒక్క జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచే మూడొంతుల భాగం సప్లయ్ అవుతుంది. అలాంటి ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేయడం వెనుక పుతిన్ యుద్ధ వ్యూహం ఏమిటో అర్థమవుతోంది. ప్రస్తుతం జపోరిజ్జియా పవర్ ప్లాంట్ సురక్షితమే అయినప్పటికీ.. అది ప్రమాదం అంచున ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, యుద్ధం అనంతరం కొన్ని నగరాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి.. సిటీలు వల్లకాడులను తలపిస్తున్నాయి.. రోడ్లపై పేలిపోయిన యుద్ధ ట్యాంకులు, చెల్లా చెదరుగా సైనికులు, పౌరుల మృతదేహాలు, కూలిన భవనాలు, రక్తపారుతున్న రోడ్లు ఇలా.. హృదయవిదారకమైన పరిస్థితి అందరినీ కదిలిస్తోంది.