Russia-Ukraine War: రష్యాలో ఉగ్రవాద దాడి జరిగింది. సైనిక శిక్షణా మైదానంలో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించగా.. 15 మంది గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన శనివారం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగింది.
ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ప్రత్యేక సైనిక ఆపరేషన్ లో స్వచ్ఛందంగా చేరేందుకు వచ్చిన వారిపై ఇద్దరు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆయుధాలతో వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు కూడా మాజీ సోవియట్ రిపబ్లిక్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరిద్దరిని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Pakistan: బైడెన్ వ్యాఖ్యలపై యూఎస్ రాయబారికి సమన్లు.. భారత్‌పై కామెంట్స్
సెప్టెంబర్ 21న రష్యా అధ్యక్షుడు పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు పిలుపునిచ్చాడు. అప్పటి నుంచి 2 లక్షల మందికి పైగా రష్యా ప్రజలు రష్యన్ సాయుధ దళాల్లో చేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే పలువురు పౌరులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరికి బెల్గోరోడ్ లో సైనిక శిక్షణ ఇస్తున్న సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.
వరసగా ఉక్రెయిన్ చేతిలో పరాజయాలు చవిచూస్తున్న రష్యాకు ఇది మరో ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో రష్యాకు వరసగా సవాళ్లు విసురుతోంది ఉక్రెయిన్. రష్యా ఆక్రమిత క్రిమియాలో ఇటీవల ఓ బ్రిడ్జ్ ను పేల్చేసింది. అయితే ఇది తమ పని కాదని ఉక్రెయిన్ చెబుతోంది. ఈ ఘటనల తర్వాత రష్యా వరసగా క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకు పడింది.