Kyiv Air Strike: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి అత్యంత భయంకరమైన ‘ఒరేశ్నిక్’ హైపర్‌సోనిక్ మిస్సైల్ ఎంట్రీ ఇచ్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ (Kyiv) – దాని చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా చరిత్రాత్మకమైన భారీ వైమానిక దాడికి దిగింది. ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యా ఏకంగా 90 క్షిపణులు, 600 డ్రోన్లను ఒకేసారి ప్రయోగించి కీవ్‌ను అతలాకుతలం చేసింది. ఈ దాడిలో అణ్వాయుధ సామర్థ్యం గల ప్రాణాంతక ‘ఒరేశ్నిక్’ (Oreshnik) హైపర్‌సోనిక్ క్షిపణిని కూడా రష్యా ఉపయోగించడం గమనార్హం.
ఈ ఘోర దాడిలో నలుగురు పౌరులు అక్కడికక్కడే మరణించగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శత్రువుల దాడుల ధాటికి వందలాది ఇళ్లు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు ధ్వంసమై అగ్నికి ఆహుతయ్యాయని వెల్లడించారు. “కీవ్ నగర చరిత్రలోనే ఇదొక అత్యంత భయంకరమైన రాత్రి. రాత్రంతా పేలుళ్ల శబ్దాలతో నగరం దద్దరిల్లిపోయింది” అని కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో ఆవేదన వ్యక్తం చేశారు. కీవ్‌తో పాటు దానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలా సెర్క్వా పట్టణాన్ని కూడా రష్యా టార్గెట్ చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ధృవీకరించారు. వేసవి కాలం ప్రారంభం కాకముందే ఉక్రెయిన్ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కుట్రతో.. నగరంలోని ప్రధాన నీటి సరఫరా కేంద్రాలను రష్యా ధ్వంసం చేసిందని జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా చేస్తున్న ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసేలా అమెరికా, ఐరోపా దేశాలు (EU) తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మూడోసారి రంగంలోకి ‘ఒరేశ్నిక్’
తమ భూభాగాలపై ఉక్రెయిన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ వైమానిక, సైనిక స్థావరాలను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా రష్యా పేర్కొంది. ఈ దాడిలో ఒరేశ్నిక్, ఇస్కాండర్, కింజల్, జిర్కాన్ వంటి విధ్వంసకర క్షిపణులను వాడినట్లు స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఈ ‘ఒరేశ్నిక్’ హైపర్‌సోనిక్ మిస్సైల్‌ను ఉపయోగించడం ఇది మూడోసారి. ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించే ఈ క్షిపణిని ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అడ్డుకోలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే హెచ్చరించారు.
మెట్రో స్టేషన్లలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని..
రాత్రంతా ఆకాశం నుంచి కురిసిన బాంబుల వర్షానికి భయపడి, కీవ్ నగర ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి భూగర్భ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. పై అంతస్తుల నుంచి వినిపించిన భీకర పేలుళ్ల శబ్దాలతో చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారేసరికి కీవ్ నగరం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయని కీవ్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
