Site icon NTV Telugu

Ukraine Crisis: రష్యా అన్నీ సిద్ధం చేసుకునే దిగిందా?

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం తారా స్థాయికి చేరింది. అమెరికా ఆశపడ్డట్టు ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యక్ష దాడి చేయలేదు. కానీ, అంతకు మించిన షాక్‌ ఇచ్చింది ప్రపంచ పెద్దన్నకు. పుతిన్‌ దురాక్రమణకు దిగాడని అమెరికా గగ్గోలు పెడుతోంది. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ప్రెసిడెంట్‌ బైడెన్‌ ఆరోపించారు. ఆంక్షల పర్వానికీ అమెరికా తెరలేపింది. రష్యాకు చెందిన ఆర్థిక సంస్థలు వీఈబీ, రష్యా మిలిటరీ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. అలాగే అక్కడి ఉన్నత వర్గాలు, వారి కుటుంబాలపై కూడా ఆంక్షలు పెట్టనుంది. ఇక దాని మిలటరీ మిత్ర దేశాలు కూడా ఆంక్షల పాటందుకున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబాతో బైడెన్ సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ సమగ్రత, సౌర్వభౌమాధికారం పట్ల అమెరికా నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ధాటించారాయన. వేర్పాటుదారుల నియంత్రణలోని లుహాన్స్క్, దోనెస్క్‌ ప్రాంతాలకు స్వతంత్రదేశాలుగా ప్రకటించటంతో పాటు ‘శాంతి పరిరక్షణ’ దళాలను తరలిస్తున్నట్టు పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా అమెరికా నిర్ణయాలను బైడెన్ ఆయనకు వివరించినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు ప్రకటించాయి. రష్యాపై కొత్త ఆంక్షలతో పాటు ఉక్రెయిన్‌కు ఆర్థిక, రక్షణ సాయం కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది.

అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్‌తో కూడా ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా భేటీ అయ్యారు. పుతిన్ ఇప్పటికైనా తీరు మార్చుకుని యుద్ధాన్ని తప్పించవచ్చని అమెరికా రక్షణ మంత్రి అన్నారు. అమెరికా తన మిత్రదళాలతో కలిసి ఈ ఘర్షణను తప్పించే మార్గం వెతుకుతోందని పెంటగాన్‌లో యుక్రెయిన్ విదేశాంగ మంత్రితో సమావేశానికి ముందు ఆస్టిన్ చెప్పారు. యుద్ధానికి దిగడం వల్ల అక్కడి శాంతిభద్రతలకు, సంక్షేమానికి విఘాతం కలగడంతోపాటూ మొత్తం అట్లాంటిక్ సమాజానికే ముప్పు వస్తుందన్నారు.

అమెరికా సహా మరికొన్ని పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు ప్రకటించాయి. రష్యాకు చెందిన ఐదు బ్యాంకులపై, ముగ్గురు బిలియనీర్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బ్రిటన్‌లో రష్యాకు చెందిన ముగ్గురు కోటీశ్వరుల ఆస్తులను స్తంభింపచేస్తున్నారు. వారిని బ్రిటన్ కూడా రాకుండా అడ్డుకుంటారు. ఆంక్షలకు గురైన ముగ్గురు ప్రముఖులలో గెనెడీ టిమ్‌షెంకో , బోరిస్ రోటెన్‌బర్గ్, ఐగర్ రోటెన్‌బర్గ్ ఉన్నారు. ఈ ముగ్గురూ పుతిన్‌కు అత్యంత సన్నిహితులు. మరోవైపు, రష్యాతో నార్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైన్ పనులను జర్మనీ నిలిపివేసింది. ఈ పైప్‌లైన్ ద్వారా రష్యా నుంచి జర్మనీతో పాటు యూరప్‌కు అవసరమైన 40 శాతం గ్యాస్ సరఫరా అవుతోంది.

మరోవైపు యురోపియన్‌ యూనియన్‌ మార్కెట్లలో రష్యా బ్యాంకుల చేరికపై కూడా ఆంక్షలు విధించారు. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రష్యాను ఏకాకిని చేసి డాలర్ల లావాదేవీలు జరపకుండా నిరోధించి ఎగుమతులు దిగుమతుల చేసుకోకుండా చేస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి.

రష్యా చర్యకు ఆంక్షలు తప్పవని అందరికీ తెలుసు. క్రిమియాను ఆక్రమించినపుడు కూడా ఇలాగే ఆంక్షలు విధించారు. కానీ తరువాత యూరప్‌ దేశాలు తమ అవసరాల కోసం మళ్లీ రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని పుతిన్‌ అంచనా. కనుక, అప్పటి వరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పుతిన్‌ ఇప్పటికే సమకూర్చుకుని ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రష్యా దాదాపు 650 బిలియన్‌ డాలర్ల కరెన్సీ నిల్వలను సిద్ధం చేసుకొంది. ఇందులో రూబుల్స్‌ ఎక్కువ. డాలర్ల శాతం అత్యంత తక్కువ ఉండేలా చూసుకుంది. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు జరిపే స్విఫ్ట్‌ నుంచి బహిష్కరిస్తే ఇబ్బంది లేకుండా సొంత ఏర్పాటు చేసుకొంది. అలాగే, దిగుమతులను గణనీయంగా తగ్గించుకుంది. చాలా రంగాలలో స్వయం సమృద్ధి సాధించింది. వాణిజ్యానికి రెండు అతి పెద్ద మార్కెట్లు చైనా, భారత్‌ రష్యాకు అందుబాటులో ఉన్నాయి. ఇలా ఆంక్షల ప్రభావం లేకుండా పుతిన్‌ ముందే జాగ్రత్త పడ్డారు.

మరోవైపు, రష్యా నుంచి ఐరోపా దేశాలు సహజ వాయువు దిగుమతులను నిలిపివేస్తే ఆ దేశాలే ఆర్థికంగా నష్టపోతాయి. ఐనా తగ్గేదేలే అని ఇప్పుడు అంటున్నా ఎంతకాలం అవి తగ్గకుండా ఉంటాయన్నది ప్రశ్న. జర్మనీ నార్డ్‌ స్ట్రీమ్‌-2కు కూడా ఇదే వర్తిస్తుంది. రష్యా బదులు అమెరికా, ఆస్ట్రేలియా, అల్జీరియా, ఖతర్‌ తదితర దేశాల నుంచి సహజవాయువు దిగుమతి చేసుకోవటం ఒక్కటే యురోపియన్‌ యూనియన్‌కు దారి. ఐతే ఇది ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. పైగా కరోనా దెబ్బకు ఐరోపా దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాయి. కనుక రష్యాను వదిలి అమెరికాను గుడ్డిగా నమ్మే పరిస్థితిలో ఆ దేశాలు లేవు. వీలైనంత త్వరలో దౌత్య పరిష్కారం కనుగొనక తప్పదు.

రష్యా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆంక్షల ప్రభావం ఉంటే పుతిన్‌ వద్ద కొత్త మార్గాలు కూడా సిద్ధంగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. రష్యా టార్గెట్‌గా నాటో దేశాలు ఉక్రెయిన్‌ను వాడుకుంటున్నాయని పుతిన్‌ బలంగా నమ్ముతున్నారు, దీనికి చెక్‌ పెట్టేందుకు అవసరమైతే ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా రష్యా వెనుకాడదంటున్నారు విశ్లేషకులు. కానీ, ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ తెలియదు.

Exit mobile version