NTV Telugu Site icon

Putin: ప్రపంచ దేశాలతో రష్యాను వేరు చేయడం అసాధ్యం

Putin

Putin

భారత్, చైనాతోనే కాకుండా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలతోనూ సన్నిహత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమకు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలతో రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు పెంచుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధం వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుందని… అక్కడ 150 కోట్ల మంది ఉన్నారన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యమని పుతిన్ వెల్లడించారు. . మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టామని… ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామంటూ యువ పారిశ్రామికవేత్తలతో వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది.

ఇక రష్యా నుంచి ఇంధన సరఫరాను నిలిపివేసి ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని ఐరోపా దేశాలు పిలుపునివ్వడంపై  పుతిన్ స్పందించారు.  రానున్న కొన్ని సంవత్సరాల్లో రష్యా ఇంధన వనరులను వదులుకోవడం ప్రతి ఒక్కరికీ అసాధ్యమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న మొదలుపెట్టిన రష్యా దురాక్రమణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా దూకుడును అడ్డుకునేందుకు పశ్చిమదేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. రష్యా తీరును నిరసిస్తూ పలు అంతర్జాతీయ సంస్థలు కూడా అక్కడ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.