NTV Telugu Site icon

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్‌, రష్యా మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ను రష్యా ప్రకటించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశ చర్యల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో కూడా ఊహించని విధంగా చేసి చూపిస్తామని ఆయన హెచ్చరించారు.

మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్‌లో పలు నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే రష్యా తాజా ప్రకటనతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురవుతున్నాయి. అటు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎలాగైనా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడాలని అమెరికా భావిస్తోంది. అయితే… రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుంతుని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.