NTV Telugu Site icon

Russia: ట్రంప్‌పై హత్యాయత్నం.. జో బైడెన్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు..

Putin, Trump

Putin, Trump

Russia: అమెరికా మాజీ అధ్యక్షుడు, నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పెన్సిల్వేనియా బట్లర్‌లో ఎన్నికల్ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి ట్రంప్ బయపడ్డాడు. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రపంచ దేశాధినేతలు ఆకాంక్షించారు. ఈ దాడిపై రిపబ్లికన్లు, అధ్యక్షుడు బో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌పై విరుచుకుపడుతున్నారు.

ఇదిలా ఉంటే, రష్యా జో బైడెన్ పరిపాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. ఇందులో ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేస్తున్న వారే ట్రంప్‌పై దాడికి కారణమయ్యారని రష్యా విదేశాంగ ప్రతినిధి జఖరోవా ఆరోపించారు. ఇదిలా ఉంటే తాజాగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్‌ని అంతమొందించడానికి, హత్య చేయడానికి ప్రస్తుత జో బైడెన్ పరిపాలన అధికారులు చేసిన ప్రయత్నమని తాము నమ్మడం లేదు’’ అని అన్నారు. అయితే, అది దాడిని రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించిందని క్రెమ్లిన్ ఆదివారం తెలిపింది.

Read Also: Crime: 5 నెలల పాపపై అత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి

బైడెన్ పరిపానల ట్రంప్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఈ రోజు అమెరికా ఎదుర్కొంటున్న దానిని రెచ్చగొట్టిందని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ట్రంప్‌పై జరిగిన దాని ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని చెప్పారు. రాజకీయ పోరాటంలో ఎలాంటి హింస జరిగినా రష్యా ఖండిస్తుందని పెస్కోవ్ అన్నారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ మిలిటరీకి నిధులు ఇవ్వడం ఆపివేయాలని మరియు బదులుగా దేశీయ చట్ట అమలును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కోరింది. ట్రంప్‌పై జరిగిన దాడి వచ్చే ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే ప్రశ్నకు.. ‘‘ దీనిపై మేము తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. మేము యూఎస్ విషయంలో జోక్యం చేసుకోవాలనే కనీస ఆలోచన రష్యాకు లేదు’’అని పెస్కోవ్ అన్నారు.

‘‘ అభ్యర్థి ట్రంప్‌ని రాజకీయాల నుంచి తొలగించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. మొదట చట్టపరమైన సాధానాలు కోర్టులు, ప్రాసిక్యూటర్లు, రాజకీయంగా అప్రతిష్టపాలు చేయడానికి, కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు. బయటి పరిశీలకులకు అతని ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని స్పష్టంగా తెలుసు’’అని పెస్కోవ్ అన్నారు. ఈ ఘటనపై ట్రంప్‌కి ఫోన్ చేసే ఉద్దేశం పుతిన్‌కి లేదని ఆయన చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కాల్చిచంపారని, అతని ఉద్దేశాన్ని అధికారులు గుర్తించలేదని అన్నారు.